chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Thursday, 30 June 2016

BIRTH HISTORY MAHABHARATHA HERO - EKALAVYA


ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు !

(ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం)
మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?
ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.
సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.
యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.
పృధుకీర్తి: పృథాచైవ
శ్రుతదేవా శ్రుత శ్రవఁ
రాజాధిదేవీ చకదా
పంచైతై వీరమాతరః
(అధ్యాయం శ్లో ౧౯-౩౨)
వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.
౧. పృదకీర్తి
భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి
కొడుకుః దంతవక్త్రుడు
౨. శ్రుతదేవ
భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు
కొడుకుఛ ఏకలవ్యుడు
౩. శ్రుతశ్రవ
భర్తః చేదిరాజు దనుఘోషుడు
కొడుకుః శిశుపాలుడు
౪. పృధ(కుంతి)
భర్తః పాండురాజు
కొడుకులుః పాండవులు
౫. రాజాధిదేవి
భర్తః అనంతపతి
కొడుకులుః విందాను విందులు
కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.
దేవశ్రవాః ప్రజాతస్తు
నైషాదిర్యః చ్రతిశ్రుతిః
ఏకలవ్యో మహారాజ
నిషాదైః వధివర్థితః
(౬-౪ శ్లో ౩౩)
ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.
సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.
ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.
అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.
మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.
హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.

Wednesday, 15 June 2016

ANUVU - SRI MAHA VISHNUVU


అణువు
(వైకుంఠపాళీ - ముందుమాట ..విశ్వనాథుడు.)

విశాలమైన ఈ ప్రపంచాన్ని విడగొట్టి చూస్తే మిగిలేది అణువే. 
మిణుగురు వెలుగూ అణువంతనే. మనసులోని వెలుగూ అణువంతనే! 
అప్పుడే పుట్టిన పసిపాప కూడా అణువంతనే! అణువులోని మహత్తు అణువుకే తెలుసు!
సముద్రపుటొడ్డున ఇసుకరేణువులు. ఒక్కొక్కటీ అణుమాత్రం.
ఒక్కక్కటే కూడితే అనంతం. అణువులో అనంతం.
అనంతానంత అణువులు. పేర్చుకొంటూ….కూర్చుకొంటూ...
ఒక అణువు మరొకదాన్ని ఢీకొడుతుంది.
ఒకటి + ఒకటి = ప్రళయం. ఇది నమ్మలేని నిజం.
అణువు సామాన్యమైనది కాదు.
ఈ విశాల విశ్వంలో భూమి ఎంత చిన్న పరమాణావో!
వేలెడంత మానవుల్లో ఎన్ని కోట్ల అణువులో!
ఒక్కో అణువునూ కదిపి, కుదిపి, నడిపించే “అహం” పరమాణువా? మహత్తా?
..
ఆ జగన్నాటక సూత్రధారి…అదిగో…ఆ అణువులోను అక్కడే ఉన్నాడు.
అక్కడొక్కచోటేనా?
ఆహా…ఆ ప్రక్కనా ఉన్నాడు. ఈ ప్రక్కనా ఉన్నాడు.
అంతేనా!
.
జగన్మాతలో ఉన్నాడు. బ్రహ్మలో ఉన్నాడు.
అక్కడ నిండిన వాయువులో ఉన్నాడు.
ఇంద్రాది సమస్త దేవతల్లోనూ, గంధర్వాదుల్లో మనోనేత్రమై, ఋషుల హృత్కమలాల్లో మెరుస్తూ, మునుల మనోవీధుల్లో సంచరిస్తూ, మానవుల మస్తిష్కాల్లో కనబడీ కనబడక,
జంతుజాలాల్లో ప్రేరకుడై, చెట్లల్లో రసమై, పర్వతాల్లో శిఖరమై,
చివరకు గడ్డిపోచల్లోని అమాయక సౌందర్యసిక్త అస్తిత్వంలోనూ…
ఆ మహావిష్ణువే…అలరారుతున్నాడు.

HEALTHY USES OF CAMPHOR - KARPURAM IN REGULAR DAILY LIFE


కర్పూరం


వాతావరణ కాలుష్యాలతో సతమతమైపోతున్న ఆధునిక కాలంలో కర్పూరం నిజంగా ఒక రక్షణ కవచమే.

• కర్పూరంతో ఇన్ని లాభాలా?

కర్పూరం వెలిగించడం అంటే అదేదో పూజలో భాగం అనుకుంటామే గానీ, దాని వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలియదు. గాలిలో ఉండే కాలుష్యాలను తొలగించే గుణం కర్పూరానికి అపారంగా ఉంది. వాతావరణ కాలుష్యాలతో సతమతమైపోతున్న ఆధునిక కాలంలో కర్పూరం నిజంగా ఒక రక్షణ కవచమే.

వైరస్, హానికారక బ్యాక్టీరియాతో పాటు దోమలను పారదోలే గుణం కూడా కర్పూరానికి ఉంది. కర్పూరాన్ని నీటిలో కరిగించి ఆ ద్రవంతో ఛాతీ మీద మర్దన చేస్తే దగ్గు, ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే ప్రముఖ కంపెనీలు కొన్ని గొంతు నొప్పి, దగ్గుకు సంబంధించిన ద్రావణాల తయారీలో కర్పూరాన్ని కలుపుతున్నాయి.

దీనికి చర్మ రంధ్రాల్లోంచి చాలా వేగంగా చొచ్చుకుపోయే గుణం ఉండడం వల్ల దురదలకు, కండరాల నొప్పికి, కీళ్ల నొప్పులకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. గాలిని శుభ్రం చేసే గుణం ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల గుండె సమస్యలకు నివారిణిగా కూడా ఉపకరిస్తుంది. గాలి తాకిడికే కరిగిపోయే గుణం ఉండడం వల్ల కర్పూరాన్ని కాల్చకుండానే దోమల్ని నివారించవచ్చు. ఇంట్లో ఏదో ఒక చోట అలా కాసేపు ఉంచితే చాలు అది పూర్తిగా కరిగిపోతుంది.

ఉదయం, సాయంత్రం గదిలో ఇరువైపులా రెండు బిళ్లలు ఉంచేస్తే చాలు. ముఖ్యంగా దోమలు ఎక్కువగా మకాం వేసే మూలల్లో కర్పూరం బిళ్లలు పెడితే అవి పారిపోతాయి. అవసరమనుకుంటే ఓ కప్పు నీళ్లల్లో కర్పూరం బిళ్లలు వే సి పడక గదిలో పెట్టేస్తే ఆ వాసనకు నిద్రాభంగం కలిగించే సూక్ష్మజీవులన్నీ మన ఛాయల్లో లేకుండా పోతాయి.

HEALTH BENEFITS WITH CHINTHA CHIGURU - TAMARIND LEAVES


చింత చిగురు యాంటీఆక్సిండెట్‌గా ప‌ని చేస్తుంది.

చింత చిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. 

చింతచిగురులో "యాంటీసెప్టిక్ "గుణాలు అధికంగా ఉంటాయి. 

ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పని చేసి, మ‌న శ‌రీరంలోని వ్యర్థాలను బ‌య‌ట‌కు తొలగిస్తుంది. అన్ని వయసుల వారూ దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వ‌వ‌చ్చు.

చింత చిగురుతో కూరా, పచ్చడీ చారు 
ఇతరత్రా వాటితో కలిపి పదార్థాల్ని చేసుకోవచ్చు. తరచూ తీసుకోవడం వల్ల "రక్తం శుద్ధి అవుతుంది. "వీటిలోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తక్షణమే తొలగిస్తాయి.

చిన్నారుల కడుపులో నులిపురుగులు ఉంటే ఎంతగానో బాధిస్తాయి. అలాంటి వారికి తరచూ చింత చిగురుతో చేసిన కూరలూ, పచ్చళ్లూ తినిపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలానే కళ్లు దురదలుగా అనిపించినా ఈ చిగురు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది.

చింతపండులో కంటే చిగురులో విటమిన్ 'సి' శాతం అధికంగా ఉంటుంది. చింత చిగురులోని యాంటీఆక్సిండెట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి.చింత చిగురు ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

BRIEF INFORMATION ABOUT LORD VENKATESWARA SWAMY GOLDEN ORNAMENTS


శ్రీవారి ఆభరణాలు

తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530) స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 2 మే1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు. తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది.


స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పని చేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది.


స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి.

Related Posts Plugin for WordPress, Blogger...

chitika