chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Wednesday, 19 November 2014

LEGS CARING TIPS IN WINTER SEASON IN TELUGU


శీతాకాలంలో పాదాలు ఎక్కువగా పగులుతాయి. పాదాల పగుళ్ళు సాదారణంగా పొడి చర్మము ఉన్న వాళ్ళకి, మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..కారణాలు తెలుసుకొందాం..

కారణాలు:

1. శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. 
కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి...అలాంటి వారు కొన్ని నివారణోపాయాలు పాటిస్తే పాదాల సౌందర్యం మీసొంతం అవుతుంది.

నివారణోపాయాలు:

1. ఇంటిపని, వంటపని చేస్తున్నప్పుడు మెత్తని స్పాంజ్ తో తయారు చేసిన స్లిప్పర్స్‌ వాడాలి.
2. రోజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి.
3. పగుళ్ళపై కొబ్బరి నునేతో మృదువుగా మర్దన చేసి మందంగా ఉండే సాక్సులు ధరించాలి.
4. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్ క్రిము లేదు రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది.
5. ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి, మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి.
6. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముషాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి.
7.గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పాదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ నొప్పి తగ్గుతుంది.
8. ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువుగా తయారవుతాయి.
9. నిమ్మరసం వ్యాజ్ లైన్ వేసిన గోరువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రంతో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
10. రోజూరాత్రిపూట హేండ్‌ క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సుధరించి నిద్రించడం మంచిది.

Thursday, 13 November 2014

DETAILED HISTORY AND FULL INFORMATION ABOUT SREE KANAKA DURGA AMMA VARU - INDRAKEELADHRI - VIJAYAWADA - ANDHRA PRADESH - INDIA


విజయ దాయిని కనకదుర్గ – ఇంద్రకీలాద్రి

అమ్మలకు అమ్మ మన దుర్గమ్మ. కోరిన కోరికల తీర్చెడి కల్పవల్లి యై, ఆర్తులను ఆదుకొనెడు అభయప్రదాత్రి యై ,కనకధారలను కురిపించు బంగారుతల్లియై, పాడిపంటలను కాపాడు నిత్యకళ్యాణి యై సువాసినీ పూజలందుకుంటున్న శ్రీ గౌరియై , దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ “ తన్ను లో నమ్మిన జనమ్ముల”నాదుకుంటూ ఇంద్రకీలాద్రి పై కొలువు తీరిన త్రిపురసుందరి కనకదుర్గ. పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్థమిది. సాధారణ దినాలలో వేలమంది, పర్వదినాలలో లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు చేసే పవిత్ర తీర్ధమిది హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పై విజయవాడ లోకి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరిని తన అమృతహస్తాలతో ఆశీర్వదిస్తూ, ఆహ్వానిస్తూ భక్తులకు తాను కొండంత అండగా వున్నానంటూ భరోసా ఇస్తున్నట్లుగా కన్పిస్తుంది ఎడమ వైపున ఇంద్రకీలాద్రి.దాని పై కొలువు తీరిన దుర్గమ్మ. అతిథులకు అర్ఘ్య పాద్య ఆచమనీయాలివ్వడం భారతీయత గనుక కుడివైపు న ఉన్న కృష్ణమ్మ నగరంలోకి ప్రవేశిస్తున్న ప్రతిఒక్కరిని తన చల్లని చిరుగాలులతో ప్రయాణపు అలసటను పోగొడుతూ తీయని మంచినీటి ని అందిస్తూ, ప్రకాశం బరాజ్ అందాలతో ఆహ్లాదాన్ని కల్గిస్తోంది. ఇది విజయవాటిక చేసుకున్న పుణ్యం. కనకదుర్గాదేవి కరు ణాకటాక్షవీక్షణాల సాఫల్యం..

* స్థలపురాణం

పూర్వం ఇంద్రకీలుడనే యక్షుడు పార్వతీ పరమేశ్వరులను గూర్చి వేల సంవత్సరాలు తపస్సు చేసి వారిని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రత్యక్షమైన ఆది దంపతులను ఎల్లప్పుడు తనపై అదివసించి ఉండేటట్లు వరం కోరాడు. అందుకు అంగీకరించిన శివపార్వతులు యక్షుణ్ణి శైలరూపాన్ని పొందవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇంద్రకీలుడు శైలరూపాన్ని పొందగా ,ఆనాటినుండి పార్వతీ పరమేశ్వరులు దుర్గా మల్లేశ్వరు లై ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరియున్నారు. యక్షుడి పేరు కీలుడని, స్వయంభువుగా వెలసిన అమ్మను ఇంద్రాది దేవతలు కొలవడం వలన ఇంద్రకీలాద్రి అయ్యిందని ఒక కథ.

విజయుడు ప్రతిష్టించిన విజయేశ్వరస్వామి ఇక్కడ కొలువు తీరి వుండటంతో ఈ పురాన్ని విజయవాటిక యని విజయవాడ అని , బెజవాడ అని కూడ పిలుస్తున్నారు.

వనవాసం చేస్తున్న పాండవులను పరామర్శించడానికి వచ్చిన వేదవ్యాసుడు మాటల సందర్భంగా పాశుపతాస్త్ర ఫ్రస్తావన చేసి, దాన్ని సంపాదించవలసిందిగా పాండవులను ఆదేశించాడు . ధర్మరాజు ఆశీస్సులను పొందిన అర్జునుడు ఇంద్రకీలాద్రి కేగి పశుపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరతపస్సు ప్రారంభించాడు.మల్లికా పుష్ఫాలతో నిత్యం శివార్చన చేస్తూ కఠోర తప మాచరిస్తున్న అర్జునుని పరీక్షించడానికి ఆది దంపతులు కిరాతవేషధారులై ప్రవేశించారు. వరాహ వేట లో మాట పెరిగింది . ధనుర్యుద్ధం ముగిసింది. మల్లయుద్ధానికి సిద్ధపడ్డారు కిరాతార్జునులు. తను విసురుతున్న ఒక్కొక్క ముష్టిఘాతానికి కిరాతుని శరీరం నుండి మల్లికా పుష్పాలు రాలడం గమనిస్తూనే ఆవేశంతో కిరాతుని కొట్టడానికి గాండీవం ఎత్తాడు విజయుడు. ఆదిదంపతులు ప్రత్యక్షమయ్యారు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు. ఆనాడు విజయుడైన అర్జునుని చేత ప్రతిష్టించబడిన లింగమే విజయేశ్వరస్వామి. ఆయన ఉన్న ప్రాంతమే విజయవాటిక.లేదా విజయవాడ.

అర్జునునితో మల్లయుద్ధము చేసిన ఈశ్వరుడు కావున మల్ల >ఈశ్వరుడు మల్లేశ్వరుడైనాడని, మల్లికాసుమాలచే పూజించబడటం వలన మల్లి > ఈశ్వరుడు > మల్లీశ్వరుడైనాడని ఒక ఐతిహ్యం.

మహిషాసురమర్దని గా ఇందకీలాద్రి పై నున్న కనకదుర్గ అష్టబాహువులతో వివిధ ఆయుధ ధారిణియై మనకు దర్శనమిస్తోంది. ధీనికి ఆధారంగా దేవీభాగవతంలో ఒక కథ కన్పిస్తోంది.

శుంభ నిశుంభులను రాక్షసులు శివుని మెప్పించి పురుషుని వలన మరణం లేకుండా వరం పొందుతారు. ఆ వర గర్వంతో దేవతలను యజ్ఞ హవిస్సులను సైతం హరించసాగారు. దేవతలు వెళ్లి శివునితో మొరపెట్టుకున్నారు . శివుని అర్థబాగమైన గౌరి తన శరీరమునుండి ఒక స్తీమూర్తిని అవతరింపజేసింది ఆమె పేరు కౌశిక. ఆమె సౌందర్యానికి మోహితులై తమను పెళ్లి చేసుకోవలసిందిగా కౌశిక వద్దకు రాయబారం పంపించారు శుంభ నిశుంభులు. యుద్ధంలో తనను ఓడించిన వారినే వివాహం చేసుకుంటానన్నది కౌశిక. ఆ యుద్దంలో రాక్షస సేనానాయకులైన ధూమ్రలోచనుడు, చండముండులను సంహరించి, ఉగ్రరూపిణియై ప్రచండదుర్గగా శుంభనిశుంభులను సైతం మట్టుపెట్టింది తల్లి.

ఇంద్రకీలాద్రి పై వెలసిన ఆ ఉగ్రరూపిణి ని దర్శించడానికి దేవతలు కూడ భయపడుతుంటే ఆదిశంకరులు శ్రీ చక్ర స్థాపన చేసి ఆమెలోని రౌద్రకళలనన్నింటిని వేరొకమూర్తిలోకి ఆవాహన చేసి శాంతమూర్తిగా మార్చి మల్లేశ్వరునితో శాంతి కళ్యాణం జరిపించారని ఆనాటి నుండి ఆమె కనకదుర్గయై భక్తులను కాపాడుతోందని స్థలపురాణం చెపుతోంది.

* ఆలయ ప్రత్యేకత

ఇంద్ర కీలాద్రి పై వెలసిన కనకదుర్గ స్వయంభువు. ఈమె అష్టభుజాలు కలిగి,శంఖ చక్ర గదా ఖడ్గ పాశ భిండి వార త్రిశూలాది ఆయుధాలను ధరించి అభయహస్తం తో మహిషాసురమర్థని గా మనకుదర్శనమిస్తోంది .ఈవిడ మహిషాసుమర్ధని అయితే దుర్గమ్మ ఎక్కడ అని వెతుకులాడే భక్తకోటికి మన పూర్వీకులు ఒకనమ్మకాన్ని ప్రచారం చేశారు. ఇంద్రకీలాద్రి ఫైనే గుహల్లో ఎక్కడో కనకదుర్గాదేవి మూర్తి ఉందని , ఆమెను నిత్యం యోగులు ఋషులు యక్షులు కిన్నెరులు దేవతలు సేవించుకుంటూ ఉంటారని మహిషాసురమర్థని ప్రథమ ద్వారం కాగా రెండవద్వారం వద్ద చింతామణి దుర్గాదేవి దర్శనం లభిస్తుందని చెపుతున్నారు.{ www.durgamma.com }.

ఈ విధమైన వాదనే వేదాద్రి యోగానందనరసింహస్వామి విషయంలోను విన్పిస్తోంది. స్వామివారు గుహలో ఉన్నారని నేను వెళ్లి వచ్చామని వయోవృద్దులై మరణించబోతూ నాతో చెప్పిన వాళ్లు న్నారు. మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడ ఇటువంటి వాదనలు విన్నాము. వీటిని స్థూలంగా విశ్లేషిస్తే-- మంత్ర ద్రష్టలు ఉపాసనాపరులునైన మనపూర్వీకులు అనేకవేరువేరు కారణాల వలన మూలమూర్తులను మరుగు పరచి ప్రతిష్ఠామూర్తులలో మూలరూపశక్తులను ఆవాహన చేసి మనకందించారేమో నని పిస్తోంది. ఇది విషయాంతరము.చర్చనీయార్హము.

సింహవాహనారూఢయైన మహిషాసురమర్ధనిగా కనకదుర్గమ్మ కొలువు తీరివుంది. ఆమెకు ఎడమ వైపు శ్రీచక్రం ఫ్రతిష్టించబడింది. ధుర్గామల్లేశ్వర స్వామి వార్లకు జరిగే పూజలన్నీ ఈ శ్రీచక్రానికే జరుగుతాయి. ప్రక్కనే గణపతి విగ్రహం ధర్శనమిస్తుంది. విజయవాడ శక్తి ప్రధానక్షేత్రమైనప్పటికి ఇచ్చట శాక్తేయ విధానంలో ఆరాధన జరగటం లేదు. ఇది ఇక్కడి ప్రత్యేకత మహిషాసురుడనే రాక్ష సుని సంహరించిన ఆదిశక్తి మహిషాసుర మర్ధని యైంది.ఆ కథ ఇలా ఉంది. దితి రాక్షసుల తల్లి.

తనసంతానాన్నిఇంద్రుడు మట్టుపెడుతుండటంతో ఇంద్రుని చంపగలిగిన కుమారుని కోసం సుపార్శుడనే ముని ఆశ్రమం ప్రక్కగా దితి ఘోరతపస్సు ప్రారంభించింది. ఆమెతపస్సువేడికి కోపగించిన సుపార్శుడు నీకు మహిషుడు పుడతాడని శపించాడు. ఆమెకు ప్రత్యక్షమైన బ్రహ్మ సైతం ముఖము మహిషమై మిగిలిన శరీరం నరరూపంతుండే కుమారుణ్ణి ప్రసాదించాడు. మహిషుడు తపస్సుచేసి శివుని మెప్పించి మరణం లేకుండా వరాన్ని కోరాడు. పుట్టిన వానికి మరణం తప్పదు అన్నాడు శివుడు. అయితే మగవానితో మరణం లేనట్లు వరం పొందాడు మహిషుడు. మహిషుని ఆగడాలను భరించలేని దేవతాగణం తమ నారీతేజాలనన్నింటిని ఒక్కచోట చేర్చి ప్రార్ధించారు. ఆ తేజస్సునుండి ప్రచండ శక్తి ఆవిర్భవించి మహిషాసురుని మట్టుపెట్టి మహిషాసురమర్ధని యై పూజలందుకుంటోంది . ఇది ఒక స్థలపురాణం.

* చారిత్రకత

క్రీ.శ. 7వశతాబ్దం. మాధవవర్మ మహారాజు విజయవాటికను పరి పాలించే రోజులవి. అతని కుమారుడు ఇంద్రకీలాద్రి సమీపంలో వేగంగా రథాన్ని నడిపి ఒక సామాన్య స్త్రీ కుమారుని మరణానికి కారణమయ్యాడు. పుత్ర శోకంతో న్యాయార్థిని యై వచ్చిన ఆ వనిత ధర్మఘంట మోగించింది. విషయాన్ని సభలో విచారించి నేరస్థుడైన తనకుమారునకు మరణదండన విధించాడు మాధవవర్మ. అతని లోని ధర్మదీక్ష కు సంతోషించిన విజయదుర్గ విజయవాటికలో కనకవర్షాన్నికురిపించి, కనకదుర్గ అయ్యిందని ఒక ఐతిహ్యం . అయితే ఈ మాధవవర్మ పల్లవుడా? తూర్పు చాళుక్యుడా? అనేది చరిత్రకారుల్లో సంశయం ఉంది. కాలం ఏదైనా కనకవర్షం మాత్రం యదార్థం.

మల్లేశ్వరస్వామి దేవాలయంలో ముఖమండపంలోని కుడి వైపు స్థంభం మీద క్రీ.శ.9 వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి కన్పిస్తోంది.

చాగి వంశానికి చెందిన” నరసింహవర్ధన” బిరుదాంకితుడైన రెండవ పోతరాజు విజయవాటిక లోని” మల్లేశ్వర స్వామికి హవిర్బిల్వార్చనలకు నోచెండ్ల గ్రామాన్ని, జక్కమపూడి లోని రెండుభాగాలను దానంచేసినట్లు” జక్కంపూడి శాసనం చెపుతోంది.{ఆర్క్-335—1882 } ఈయన కాలం శా.శ. 1119 -1152. గుడిమెట్ట ను రాజధానిగా చేసుకొని, విజయవాటిక ,బృహత్కాంచీపురా{ పెనుగంచిప్రోలు } లను ఉపకేంద్రాలుగా చేసుకొని రెండు శతాబ్దాలు పరిపాలన సాగించిన చాగి వంశంలో ఇతని పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు.

అలాగే మనం “ బెజవాడ “అని పిలుస్తున్న పేరు కూడ అతి ప్రాచీనమైనది గానే కన్పిస్తోంది. రెండవపోతరాజు కాలంలోనే కొనకంచి ఆంజనేయస్వామి దేవాలయ స్ధంభం మీద ఉన్న శాసనంలో “ బెజవాడ తెలికివేవురు కులానికి చెందిన కుఱ్ఱిశెట్టి కొనకంచి నరేంద్రేశ్వర దేవరకు దీపమాలలు రెండుసేయించ్చె.... అని” వ్రాయబడింది. { ఆర్క్-270-1924}

శ్రీకృష్ణ దేవరాయలు దుర్గామల్లేశ్వరులను దర్శించి కానుకలు సమర్పించినట్లు శాసనాలున్నాయి. అక్కన్న మాదన్నగుహలు చారిత్రక ఆధారాలే.ఆముక్తమాల్యద కావ్యం చెరిగి పోని సాక్ష్యం కదా! బెజ్జంవాడ > బెజవాడ అయ్యిందని ఒక వాదన .
ప్రత్యేక ఉత్సవాలు ప్రతిసంవత్సరము అమ్మవారికిజరిగే ఉత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రధానమైనవి. తొమ్మిది రోజులు తొమ్మిది శక్తిరూపాలతో తల్లి భక్తులను కటాక్షిస్తుంది. వీటినే దేవీనవరాత్రులుగా వ్యవహరిస్తారు.ఇవి సెప్టెంబరు- అక్టోబరు నెలల్లో వస్తాయి. శివరాత్రికి దుర్గా మల్లేశ్వర కల్యాణం వైభవంగా జరుగుతుంది. నవంబరు- డిశెంబరు నెలల్లో భవానీదీక్షలు అంగరంగవైభవంగా జరుగుతాయి.ఇంద్రకీలాద్రే కాదు విజయవాడే దీక్షాధారులతో నిండిపోతుంది.

* ఆలయం తెరచి ఉంచు వేళలు

ప్రభాతవేళ 4గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు వివిధ దర్శనాలు లభిస్తాయి .

* రవాణాసౌకర్యాలు

విజయవాడ అతి పెద్ద రైల్వే జంక్షన్. దేశం నలుమూలలనుండి రవామా సౌకర్యం పుష్కలంగా ఉంది. కొండమీదకు 500 మెట్లతోటి కాలిబాట, ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి దేవస్ధానం వారి బస్సు సౌకర్యం ఉంది. కొండమీదకు స్వంతవాహనాలకు టోల్ రేటు అనుమతి ఉంది.

* వసతిసౌకర్యాలు

దేవస్దానం వారి వసతి గదులు రూ 50/ నుండి 250/ రూపాయల పరిధిలో ఆయా వసతులతో లభిస్తాయి .లగ్జరీ రూములు కావాలనుకొనే వారికి పెద్ద హోటళ్లు అందుబాటు లోనే ఉంటాయి. ప్రతిరోజు 600 నుండి 1000 మంది వరకు నిత్యాన్న దానం జరుగుతూ ఉంటుంది.

సంప్రదించవలసిన నెంబర్లు 0866-2423600 , 0866-2423800
వివరాలకు www.dugamma.com లో కూడ చూడవచ్చు.

FULL DETAILS AND HISTORY OF SRI SRI SRI BALA PARVATHI SAMETHA SRI JALADEESWARA SWAMY VARI TEMPLE - GHANTASALA - KRISHNA DISTRICT - ANDHRA PRADESH - INDIA


 ఘంటశాల జలథీశ్వరస్వామి

కృష్ణాతీరం లో వెలసిన తీర్దక్షేత్రాల్లో ఘంటశాల ఒకటి.ఆంద్రదేశం లోనే కాకుండా భారతదేశం లోనే ఎక్కడా లేని విధంగా శివపార్వతులిద్దరూ ఒకే పానమట్టం పై దర్శనమిచ్చే ఏకైక క్షేత్ర మిది. జలథీశ్వరస్వామి గా స్వామి సేవలందుకుంటుంటే, బాలపార్వతి గా అమ్మవారు భక్తులను తన కరుణాకటాక్ష వీక్షణాలతో కాపాడుతూ వస్తోంది . ఇది తరతరాలనాటి మాట.ఎందుకంటే ఈ ఆలయం రెండవశతాబ్ది కంటే పూర్వపు దని చరిత్రకారులు శాసనాద్యాధారాతో నిర్ధారించారు. ఒకే పీఠం మీద ఆదిదంపతులు కొలువు తీరిన రమణీయ దృశ్యం భక్తులను పరవశులను చేస్తుంది.పెద్దముతైదువ పెనిమిటి తో కలసి ఏకపీఠం మీద దర్సనమివ్వడం అపురూప దృశ్యం కదా. ఇటువంటి మూలవిరాట్ సందర్శనం సకలశుభాలను, సుఖాలను,సంపదలను , కీర్తిప్రతిష్టలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

* స్థలపురాణం:

హిమవంతుని కుమార్తె గా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి, శంకరుని మెప్పించింది. సప్తఋషులు పెళ్లి పెద్దలుగా వెళ్లి వివాహాన్ని నిశ్చయం చేశారు. కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపథానికి బయలుదేరింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగి పోయే ప్రమాదం సంభవించింది.ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిపించి, తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి, పూజలు జరిపితే తమ కల్యాణం చూచిన ఫలం లభిస్తుందని, వెంటనే ఆ పని చేయవలసిందని ఆజ్ఞాపించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి, మహా తప స్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి విచ్చేసి, ఘంటసాల ను పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని పానమట్టంమిద శివపార్వతులను ప్రతిష్ఠించి, ఏకాగ్రతతో పూజాదికాలు నిర్వహించి శ్రీస్వామివారి సాక్షాత్ కళ్యాణమహోత్సవసందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి దక్షిణకైలాసం గా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. అప్పటికి ఈ గ్రామం సముద్రం, కృష్ణానది కలిసే నదీ ముఖ ద్వార ప్రదేశంగా ఉండేది. జలథి అంటే సముద్రం. సముద్రం లో నౌకాయానానికి బయలుదేరేముందు నావికులు గంగానాథుడైన ఈ స్వామిని పూజించి , బయలుదేరేవారని, తిరిగి వచ్చిన తరువాత మళ్లీ స్వామిని దర్శించుకొనే ఇళ్లకు వెళ్లేవారు. దుకే ఈ స్వామి జలథీశ్వరుడయ్యాడు. 1,2 శతాబ్ధాలలోకంటకశ్శిల అనేపేరు గల ఘంటశాల ప్రముఖ నౌకా కేంద్రంగా విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

* ఆలయప్రత్యేకత.

శివపార్వతులిద్దరు ఒకే పానమట్టం మీద దర్శనమివ్వడం ఈ ఆలయప్రత్యేకత.ఈ పానమట్టం ఏకఱాతిశిల. దీని నాలుగుమూలలా నాలుగు కాళ్లు ఉండి దానిపై పైనమట్టం నిలిచి ఉంటుంది.పానమట్టం భూమిని తాకక పోవడం ఒక ప్రత్యేకత.

ఈ ఆలయ గోపురం” గజపృష్టాకార గోపురం” గా పిలవబడుతోంది. అంటే సాధారణ ఆలయాల గోపురం వలే కాకుండా ఇది మూడు శిఖరాలను కలిగిఉంటుంది. తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం మాత్రమే ఇటువంటి ఆకృతిని కలిగి ఉంది విమాన శిఖరం ఎత్తు కూడ 45 అడుగులవరకు ఉంటుంది. ఈ విమానగోపురం పాటిమట్టి తో నిర్మించబడి తరువాత కాలంలో సిమెంటు ప్లాస్టింగ్ చేయబడింది.

మహామేరు శ్రీ చక్రం ఈ ఆలయంలో అమ్మవారి ముందు అర్చించ బడుతోంది.32కిలోలబరువు తో,9అంగళాల ఎత్తు కలిగి పంచలోహాలతో చేయబడిన ఈ శ్రీ చక్రాన్ని కంచి పీఠాథిపతుల అనుగ్రహంతో కంచి పీఠంనుండి తెచ్చి ప్రతిష్టించడం జరిగింది . పూజ్యశ్రీ రామేశ్వరానందగిరి స్వామి వారిచే ఆలయములో అమ్మవారి పాదముల చెంత ఉంచబడి పూజించబడుతోంది.

కంచిపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు జయేంద్రసరస్వతీ స్వామి వారు ఈ ఆలయంలోని పీఠాన్ని అర్థనారీశ్వర పీఠంగా నిర్థారించారు.

* నవగ్రహమండపం.:

ఏకపీఠంపై వెలసిన సివపార్వతుల వలెనే నవగ్రహాలకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ ఆలయము నందలి నవగ్రహమండపం లో కొలువు తీరి ఉండటం మరొక ప్రత్యేకత.ఇటువంటి నిర్మాణం చాలా అరుదుగా దర్శనమిస్తుంది. ఏలినాటిశని నుండి అన్నిరకాల శనిదోష నివారణకు, రాహుకేతు పూజలకు ఈ మందిరం అత్యంత ప్రసిద్ది.

* శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం.

ఈ ఆలయ ఆవరణ లోనే 200 సంవత్సరాల నాటి వల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రమణ్యేశ్వర ఆలయం ఉంది. మార్గశిర మాసంలో షష్టి ఉత్సవాలు తిరునాళ్లను తలపిస్తూ అత్యంతవైభవంగా జరుగుతాయి. సంతానాకాంక్షులయిన దంపతులు స్వామివారికి పూజలు చేయించి మందిరానికి వెనుకనున్న నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోయడం, అనంతర కాలంలో తల్లిదండ్రులై మరలా వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం.

దేవాలయఆవరణ లో నైఋతిభాగంలో శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది.పూర్ణిమ తరువాత వచ్చే చవితికి ఈ ఆలయంలో విశేషపూజలు జరుగుతాయి. జలథీశ్వరుని అభిషేకజలం ఆరోగ్యప్రదాయిని . ఈ అర్దనారీశ్వరుని అభిషేకజలం సర్వరోగనివారిణి యని జనశ్రుతి.

అంత్రాలయ ద్వారానికి పైన ఆది శంకరుల విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఎడమ వైపు కాలభైరవుడు, కుడివైపు నరసింహస్వామి ద్వారపాలకులు గా దర్శనమిస్తారు. దీనిని శివ కేశవాభేదానికి ప్రతీకగా భక్తులు చెప్పుకుంటారు.ఈ రెండు పాలరాతి విగ్రహాలు క్రీ,శ, 2 వ శతాబ్దానికి చెందినవి గా పురావస్తు శాఖ వారు నిర్దారించారు.

* చారిత్రకత. 

ఇది అత్యంత ప్రాచినమైన శైవక్షేత్రం. ఇక్కడ లభించిన సరస్వతీ దేవి, రతీదేవి విగ్రహాలు క్రీ.పూ. 6000 సంవత్సరాలనాటి హరప్పా ,మొహంజొదారో శిల్పకళ కు చెందినవి గా చరిత్ర పరిశోధకులు గుర్తించారు.

క్రీ.శ.1 వ శతాబ్దం లో ఘంటశాల ను “కంటకశైల “గా ఫ్రెంచి చరిత్రకారుడు డూబ్రెయిల్ తన డక్కను పూర్వచరిత్ర లో పేర్కొన్నాడు.టోలమీ మొదలగు చరిత్రకారులు ఈ రేవు పట్టణాన్ని సందర్శించారు. చోళుల కాలం లో చోళపట్టణం గా, పాండ్యులకాలం లో పాండ్యపురంగా తరువాత ఘంటశాల గా పిలువబడుతోంది. రోమనుల కాలం నాటికే ఈ పట్టణం ప్రసిద్ద ఓడరేవు గా ఉన్నట్లు చారిత్రకాధారాలున్నాయి.

సుమారు ఏడు శాసనాలు ధేవాలయ ఉత్తర గోడమిద, బావి త్రవ్వేటప్పుడు బయటపడ్డాయి.ఇవన్నీ దాన శాసనాలే

* రవాణాసౌకర్యాలు.

విజయవాడ,గుడివాడ,మచిలీపట్నం, రేపల్లె ల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. బారసాల,అక్షరాభ్యాసం,గ్రహశాంతులు, జరిపించుకోవడానికి వచ్చే దూర ప్రాంత భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కలదు.స్వంతవాహనం ఉన్నట్లయితే విజయవాడ నుండి కఱకట్ట మీదుగా 52 కి.మీ లో శ్రీకాకుళం,కొడాలి మీదుగా ఘంటశాల కు చేరుకోవచ్చు.

BHAKTHI YOGA - SRI BHAGAWADHGEETHA
భక్తియోగః 1( అథ ద్వాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత
అర్జున ఉవాచ:-
ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే,
యే చాప్యక్షర మవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః‌.
అర్జునుడు చెప్పెను - ఈ ప్రకారముగ ఎల్లప్పుడును మీయందే మనస్సును నెల్కొల్పినవారై ఏ భక్తులు మిమ్ముపాసించుచున్నారో, మరియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, ఆయిరు తెగలవారిలో యోగమును బాగుగ నెరిగిన వారెవరు?.
******************************************************************************************* 1
శ్రీ భగవానువాచ:-
మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే‌,
శ్రద్ధయా పరయోపేతా
స్తే మే యుక్తతమా మతాః.
శ్రీ భగవానుడు చెప్పెను: నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై (తదేకనిష్థులై) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై ఎవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా యభిప్రాయము.
******************************************************************************************* 2
యే త్వక్షరమనిర్దేశ్య
మవ్యక్తం పర్యుపాసతే,
సర్వత్రగమచింత్యం చ
కూటస్థమచలం ధ్రువమ్‌.
సంనియ మ్యేంద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః,
తే ప్రాప్నువంతి మామేవ
సర్వభూతహితే రతాః
ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీన పరచుకొని) ఎల్లడల సమభావముగలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తి గల వారై ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవికానిదియు, నిర్వికారమైనదియు, చలింపనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియు నగు అక్షరబ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.
******************************************************************************************* 3,4
క్లేశోధికతర స్తేషా
మవ్యక్తాసక్త చేతసామ్‌,
అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే.
అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునం దాసక్తి గల మనస్సు గలవారికి (బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగునోపాసకుల కంటె) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది.
******************************************************************************************* 5
యే తు సర్వాణి కర్మాణి
మయి సన్న్యస్య మత్పరాః,
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయంత ఉపాసతే.
తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసారసాగరాత్‌,
భవామి న చిరాత్పార్థ
మయ్యావేశిత చేతసామ్‌
ఓ అర్జునా! ఎవరు సమస్తకర్మములను నాయందు సమర్పించి, నన్నే పరమగతిగ దలచినవారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను .
******************************************************************************************* 6,7
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః.
నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహము లేదు.
******************************************************************************************* 8
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్‌,
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ.
ఓ అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము).
******************************************************************************************* 9
అభ్యా సేప్యసమర్థోసి
మత్కర్మపరమో భవ,
మదర్థమపి కర్మాణి
కుర్వన్‌ సిద్ధి మవాప్స్యసి.
ఒకవేళ అభ్యాసము చేయుటయందును నీ వసమర్థుడవైతివేని నాసంబంధమైన కర్మలజేయుటయందాసక్తి గలవాడవుకమ్ము. అట్లు నా కొరకు కర్మలను జేయుచున్ననుగూడ నీవు మోక్షస్థితిని బడయగలవు.
******************************************************************************************* 10
అథై తదప్యశక్తోసి
కర్తుం మద్యోగమాశ్రితః,
సర్వకర్మఫలత్యాగం
తతః కురు యతాత్మవాన్‌.
ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించిన వాడవై దీనినిగుడ నాచరించుటకు శక్తుడవుకానిచో అటుపిమ్మట నియమింపబడిన మనస్సుగలవాడవై సమస్త కర్మములయొక్క ఫలములను త్యజించివేయుము.
******************************************************************************************* 11
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్‌
జ్ఞానాద్ధ్యానం విశిష్యతే,
ధ్యానాత్కర్మఫలత్యాగ
స్త్యాగాచ్ఛాంతిరనంతరమ్‌‌.
వివేకముతోగూడని అభ్యాసముకంటె (శాస్త్ర జన్య) జ్ఞానము శ్రేష్ఠమైనదికదా! (శాస్త్రజన్య) జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్ఠమగుచున్నది. ధ్యానము (ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనఃస్థితి) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృత్తి యందును విషయ దోషము లేకుండుట శ్రేష్ఠమైయున్నది. అట్టి కర్మఫలత్యాగముచే శీఘ్రముగ చిత్త) శాంతి లభించుచున్నది..
******************************************************************************************* 12
అద్వేష్టా సర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ,
నిర్మమో నిరహంకారః
సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్ట స్సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః
మయ్యర్పిత మనోబుద్ధి
ర్యోమద్భక్తస్స మే ప్రియః
సమస్త ప్రాణులయెడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖదుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరకుకొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 13, 14
మస్మాన్నో ద్విజతే లోకో
లోకాన్నో ద్విజతే చ యః,
హర్షామర్ష భయోద్వేగై
ర్ముక్తో యస్స చ మే ప్రియః.
ఎవని వలన ప్రపంచము (జనులు) భయమును బొందదో, లోకమువలన ఎవడు భయమును బొందడొ, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు .
******************************************************************************************* 15
అనపేక్ష శ్శుచిర్దక్ష
ఉదాసీనో గతవ్యథః,
సర్వారంభ పరిత్యాగీ
యో మద్భక్తస్స మే ప్రియః.
కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతరశుద్ధిగలవాడును, కార్యసమర్థుడు (సమయస్ఫూప్తి గలవాడును) తటస్థుడును, దిగులు (దుఃఖము) లేనివాడును, సమస్త కార్యములందును కర్తృత్వమును వదలినవాడును (లేక సమస్తకామ్యకర్మలను, శాస్త్ర నిషిద్ధకర్మలను త్యజించినవాడును) నాయందు భక్తిగలవాడును, ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 16
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాంక్ష తి,
శుభాశుభ పరిత్యాగీ
భక్తిమాన్‌ యస్స మే ప్రియః.
ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును బొందడో, ఎవడు శుభాశుభములను వదలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 17
సమశ్శత్రౌ చ మిత్రే చ
తథా మానావమానయోః,
శీతోష్ణసుఖదుఃఖేషు
సమస్సజ్గవివర్జితః.
తుల్యనిందాస్తుతిర్మౌనీ
సంతుష్టో యేన కేనచిత్‌,
అని కేతః స్థిరమతి
ర్భక్తిమాన్మే ప్రియో నరః
శత్రువునందును మిత్రునియందును, మానావమానములందును, శీతోష్ణ సుఖదుఃఖములందును సమముగ నుండువాడును, దేనియందును సంగము (ఆసక్తి, మనస్సంబంధము) లేనివాడును, నిందాస్తుతులందు సమముగ నుండువాడును, మౌనముతో నుండువాడును (లేక మననశీలుడును), దేనిచేతనైనను (దొరికినదానితో) తృప్తిని బోందువాడును, నిర్దిష్టమగు నివాసస్థానము లేనివాడును (లేక గృహాదులందాసక్తి లేనివాడును), నిశ్చయమగు బుద్ధిగలవాడును, భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు.
******************************************************************************************* 18, 19
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే,
శ్రద్ధధానా మత్పరమా
భక్తాస్తేతీవ మే ప్రియాః
ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి (నాయం దాసక్తి గలవారై) ఈ అమృతరూపమగు (మోక్షసాధనమైన) ధర్మమును (ఇప్పుడు చెప్పబడిన ప్రకారము) అనుష్ఠించుదురో అట్టిభక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.
******************************************************************************************* 20
ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, భక్తియోగోనామ, ద్వాదశోధ్యాయః


TELUGU PURANA STORIES - BHANGARU MUNGISA STORY IN TELUGU


బంగారు ముంగిస-శ్రీ మహాభారతంలో కథలు

ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్థుడి సంరక్షణలో సమస్త భూమండలాల్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తుచేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేథయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు ధర్మరాజుని ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికీ కోటీవేల బంగారు నాణాలను ఇచ్చి తన రాజ్యమంతటినీ వేదవ్యాసమహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.

"ధర్మతనయా! నువ్వు నాకు దక్షిణగా రాజ్యమంతా ఇచ్చావు. కాని, నాకు బంగారం కావాలి. భూమి అక్కర్లేదు. కనుక ఈ భూమికి వెలకట్టి దానికి తగిన బంగారం ఇచ్చి ఈ భూమిని నువ్వే తీసుకో" అన్నాడు మహర్షి.
"స్వామీ! అశ్వమేథయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే తమకు భూమిని సమర్పించుకున్నాను. నేను అరణ్యానికి వెళ్ళి సుఖంగా వుంటానిక. అంతేకాని బ్రహ్మధనాన్ని తిసుకుంటానా?" అన్నాడు ధర్మరాజు.
"రాజా! మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది? ఇందులో ఏ దోషం లేదు, తీసుకో" అన్నాడు వ్యాసముని.

"సరే అయితే!" అంటూ కోటికోట్ల మాడలు కుప్పగా పోసి, "ఇది ఈ భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు ధర్మరాజు. ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు, తోరణాలను అందరికీ దానం చేశాడు ధర్మరాజు.

"రండి! మీకేం కావాలో చెప్పండి. ఇవిగో వస్త్రాలు! ధరించండి! రకరకాల బంగారు పాత్రలివిగో - స్వీకరించండి" అంటూ అందర్నీ పిలిచి పిలిచి ఇచ్చాడు భీముడు.

ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనేలేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు. సిద్ధులూ విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.
తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు. ఆమె దాన్ని అందరికీ దానం చేసింది. యజ్ఞానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగ సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే, అప్పుడొక చిత్రం జరిగింది.

ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటకి వచ్చి, "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం మరీ అంతగా మెచ్చాలా! సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేథయాగం?!" అంటూ మూతి విరిచింది.

ఆ మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. "అదేమిటి అలా అంటున్నావు. ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?" అని విప్రులు ముంగిసను ప్రశ్నించారు.

"అయ్యా! ఆకలిని, తృష్ణను జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతిని త్యజించి సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావుమంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యులు చేసి, "ఆరగించండి స్వామీ" అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండినీ భక్తితో సమర్పించారు. నాటి అతని దానదక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణిమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు. అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నాతలా, శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి! ఇదీ ఆ సక్తుప్రస్ఫుడి ధర్మమహిమ!!

"మిగిలిన శరీరం కూడా బంగారుమయం చేసుకుందామని ఎన్ని యజ్ఞ ప్రదేశాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకూ తారసపడలేదు. ఈ నాడు ధర్మరాజు యాగం చేస్తున్నాడుకదా, నా కోరిక తీరకపోతూందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశ అయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనబడకుండా మాయమయింది.


GODDESS SREE KANAKADURGA PRAYER


" ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః "
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | 
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ 
తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ 
అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ 
కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ 
పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ 
చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ 
తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే 
ఆదిత్యవ’ర్ణే తపసో‌உధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |
తస్య ఫలా’ని తపసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః 
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే 
క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ 
గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ 
మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ 
కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ 
ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే 
ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ 
ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ 
తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ 
యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్,
విందేయం పురు’షానహమ్ 
ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుపత్నీ చ’ ధీమహి 
తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ 
శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’

ఓం శాంతిః శాంతిః శాంతిః’

Related Posts Plugin for WordPress, Blogger...

chitika