WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 15 June 2016

BRIEF INFORMATION ABOUT LORD VENKATESWARA SWAMY GOLDEN ORNAMENTS


శ్రీవారి ఆభరణాలు

తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450)లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530) స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించాడు. 2 మే1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించాడు. తంజావూరు రాజులు పాండ్యన్‌ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్‌ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది.


స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పని చేసిన థామస్‌ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా సమర్పించారు. వేంకటేశ్వర హెచరీస్‌ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ ‌ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది. తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది.


స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారము, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి.

No comments:

Post a Comment