WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 30 June 2016

BIRTH HISTORY MAHABHARATHA HERO - EKALAVYA


ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు !

(ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం)
మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?
ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.
సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.
యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.
పృధుకీర్తి: పృథాచైవ
శ్రుతదేవా శ్రుత శ్రవఁ
రాజాధిదేవీ చకదా
పంచైతై వీరమాతరః
(అధ్యాయం శ్లో ౧౯-౩౨)
వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.
౧. పృదకీర్తి
భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి
కొడుకుః దంతవక్త్రుడు
౨. శ్రుతదేవ
భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు
కొడుకుఛ ఏకలవ్యుడు
౩. శ్రుతశ్రవ
భర్తః చేదిరాజు దనుఘోషుడు
కొడుకుః శిశుపాలుడు
౪. పృధ(కుంతి)
భర్తః పాండురాజు
కొడుకులుః పాండవులు
౫. రాజాధిదేవి
భర్తః అనంతపతి
కొడుకులుః విందాను విందులు
కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.
దేవశ్రవాః ప్రజాతస్తు
నైషాదిర్యః చ్రతిశ్రుతిః
ఏకలవ్యో మహారాజ
నిషాదైః వధివర్థితః
(౬-౪ శ్లో ౩౩)
ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.
సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.
ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.
అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.
మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.
హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.

No comments:

Post a Comment