WORLD FLAG COUNTER

Flag Counter

Monday 25 January 2016

GAJENDRA MOKSHAMU - TELUGU PURANA STORY ABOUT LORD SRI MAHA VISHNU


గజేంద్ర మోక్షం - శ్రీమద్భాగవతం 

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. అక్కడ వరుని దేవుని దయచేత యెప్పుడూ మలయమారుతం వీస్తూనే ఉంటుంది. అందుచేత అక్కడికి దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు.
హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.
పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రాజుపై కోపం వచ్చి , " మదించి ఉన్నట్లున్నావు. అందుచేత నువ్వు ఒక మదపుటేనుగువై పోదువుగాక" అని రాజుని శపించాడు.
అదంతా తన ప్రారబ్ధకర్మ, అనుభవించ వలసినదే అని రాజు మాట్లాడలేదు. తక్షణమే ఇంద్రద్యుమ్నుడు త్రుకూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగు రాజయిపోయాడు. ఆ ఏనుగురాజెంత బలంగా ఉండేవాడంటే , వాడిని చూడగానే సింహాలు, పులులు , కూడా పరుగెత్తి పారిపోయేవి. ఒక నాడు ఆ యేనుగులరాజు తన గుంపుతో పసందైన ఆకులన్నీ తింటూ తిరిగి తిరిగి , అలసిపోయాడు. గొప్ప దాహమయింది. త్రికూట పర్వతం నుండి చల్లని మలయమారుతం వస్తుంది. ఆ వైపు ఏనుగులరాజు దారి తీసాడు. అలా అలా వెల్లగా ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకుని , తన గుంపుతో జలక్రీడలాడుకోడం మొదలు పెట్టాడు.
ఆ సరోవరరంలోనే శాపవశాన్న మొసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ మొసలి చట్టున వచ్చి , ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ మొసలి నుంచి విడిపించుకుందామని గజేంద్రుడు యెంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులుకూడా సాయం చేయవచ్చాయి. కాని లాభం లేకపోయీంది. హోరా హోరీగా ఆ రెండూ వేయేళ్లు పోరాడుకున్నాయి. ఈ భయంకరమైన పోరాటం చూడడానికి దేవతలందరూ వచ్చి యేమవుతుందో అని కుతూహలంతో కళ్లప్పగించి ఉండిపోయారు.
క్రమంగా ఏనుగు అలసిపోయి , మొసలిదే పైచేయి అవవచ్చింది. గజేంద్రుడికి మరి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. పూర్వజన్మ వాసన వలన దైవచింత వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి , " నేనింక పోరాడలేను. ఎవరి ఆజ్ఞచేత యీ ప్రపంచమంతా నడుస్తుందో, ఎవరు తానే సర్వమయి అంతటా ఉన్నాడో , అతడైన నీవే , తండ్రీ , నా దిక్కు" అని దేవుని పార్ధించడం మొదలు పెట్టాడు గజరాజు .
తమని పేరుపెట్టి పిలవలేదని బ్రహ్మ , శివుడు దాని ప్రార్ధనలు పట్టించుకోలేదు. ఏమేమని దేవుని వర్ణించి ప్రార్ధించాడో అవి తనకే చెల్లుతాయి అని శ్రీహరి పరుగుపరుగున గరుడవాహనుడై , అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏనుగు తొండమెత్తి మొక్కుతూండగా , తన చక్రం వేసి , ఆ మొసలిని చంపేసాడు. శాపవశాన్న మొసలి అయిన గంధర్వుడు శ్రీ హరి చక్రంతో శాపవిముక్తుడై , తన యథారూపంలో లేచి వచ్చి , విష్ణుమూర్తికి నమస్కరించిన తరువాత తన లోకానికి వెళ్లిపోయాడు. గజరాజు మొక్కుతూండగా ఆ గజేంద్రమోక్షణం వింతగా చూడవచ్చిన దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు.

No comments:

Post a Comment