chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Saturday, 12 December 2015

MONKEY INTELLIGENT


కోతి తెలివి

'జంతువులే కదా, వాటికేం తెలుసు' అనుకోకండి. ఈ కథలో కోతి సమయస్ఫూర్తితోటీ, మంచితనంతోటీ ఏమేం సాధించిందో చూడండి.. 

రచన: శ్రీరామనేని ఆర్య, 5వతరగతి, రిషివ్యాలీస్కూల్, మదనపల్లి, చిత్తూరు జిల్లా.

ఒక ఊరిలో చందు-బిందు అనే అన్నా చెల్లెళ్లు ఉండేవారు. చందు ఏడవతరగతి, బిందు నాలుగవ తరగతి చదువుతున్నారు.

ఒకరోజు ఇద్దరూ బడినుండి ఇంటికి వస్తుంటే, దారిలో ఓ చెట్టు కింద చిట్టి కోతి పిల్ల ఒకటి క్రింద పడి కనిపించింది. దానికి ఇంకా చెట్టుపైకి ఎక్కటం వస్తున్నట్లు లేదు. చందు బిందు ఇద్దరూ దాని తల్లి కోసం అటూ ఇటూ కలయ చూసారు- కానీ అది ఎక్కడా లేదు! కోతిపిల్లేమో ఆకలితో కిచకిచలాడుతోంది. "మనం దీనికి ఏమన్నా పెడదామా, తినేందుకు?" అడిగాడు చందు. "పెడదాం పెడదాం!" అని తన డబ్బాలో మిగిలిపోయిన

అరటిపండుని బయటకి తీసి, కోతికి పెట్టింది బిందు. కోతి దాన్ని తీసుకొని తిన్నది.

కొంచెంసేపు అట్లా నిలబడి దాన్ని చూసి, ఇంటికి బయలుదేరారు చందు-బిందు. కొంచెం సేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే కోతి వాళ్ళ వెంటే వస్తోంది!

"ఏయ్! వెనక్కి వెళ్ళు" అని ఎంత అరిచినా వింటేగా? ఆ కోతి వాళ్ళ వెనకాలనే ఇంటివరకూ వచ్చేసింది!

"అన్నయ్యా , మనం దీన్ని పెంచుకొందామా?" అన్నను అడిగింది బిందు.
"నాకూ ఇది చాలా నచ్చింది- కానీ అమ్మ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో.. అడిగి చూద్దాం!" అన్నాడు చందు.

ఇద్దరూ సంతోషంగా కోతిని ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళారు.
వాళ్ల చేతుల్లో ముడుచుకొని కూర్చున్న కోతిని చూడగానే అమ్మ ఒక్కసారి అదిరిపోయి "గయ్.."మని అరిచింది- "ఏయ్..ఏంటి, ఈ కోతిని నేరుగా ఇంట్లోకే తీసుకొచ్చారు? ఛీ..ఛీ.. ఇది చాలా మురికిగా ఉంది! బయట వదిలెయ్యండి!" అరిచింది అమ్మ.

"వద్దమ్మా, ప్లీజ్! ఈ కోతిపిల్ల చాలా బాగుంది.. ప్లీజ్! దీన్ని మనం పెంచుకుందాం!" అని పిల్లలిద్దరూ అమ్మను బ్రతిమాలారు.

చాలా సేపు వద్దన్నాక, చివరికి అమ్మ ఒప్పుకున్నది- "సరే కానివ్వండి.. కానీ ఇది ఇంట్లో ఉన్న వస్తువులు వేటినీ పాడు చేయకుండా మీరే చూసుకోవాలి. పనులు ఎక్కువౌతాయి.. దాని పనులన్నీ మీరే చేయాలి మరి!" అన్నది అమ్మ.

'ఒప్పుకున్నది- అంతే చాలు' అనుకొని,"సరే" అని ఎగిరి గంతేశారు ఇద్దరూ.

"ఆగండాగండి! ఇప్పుడంటే ఇది చిన్నగా ఉంది. పెద్దదయ్యాక దీన్ని భరించటం నా వల్ల కాదు. అప్పుడింక మీరు దీన్ని అడవిలో వదిలేయాలి..

అందుకు ఒప్పుకుంటేనే, మరి- చెప్పండి!" అంది అమ్మ.

"ఊఁ అట్లా ఏం వద్దు.." అన్నారు పిల్లలు. కానీ అమ్మ ఏమాత్రం తగ్గలేదు. చివరికి పిల్లలే దిగి వచ్చారు. "సరే" అని ఒప్పుకున్నారు. కొంచెం దిగులుగానే తలలు ఊపి, కోతిని ఎత్తుకొని తమ గదిలోకి తీసుకువెళ్ళారు. తన బట్టల బుట్టలో గబగబా ఒక పాత దుప్పటిని పరిచాడు చందు. కోతిని తీసుకెళ్ళి దానిలో పెట్టింది బిందు. పిల్లలిద్దరూ బడి బట్టలు మార్చుకొన్నాక, ఇక దానితో ఆటలు మొదలు పెట్టారు. రోజూ నిద్రలేవగానే వాళ్ళు పాలు తాగేవాళ్ళు. ఇప్పుడు తాము తాగేవి, తినేవన్నీ కోతికి కూడా ఇవ్వటం మొదలుపెట్టారు.

ఇలా రెండుసంవత్సరాలు గడిచాయి. పిల్లలిద్దరికీ కోతి చాలా మంచి ఫ్రెండు అయ్యింది. వాళ్లతోబాటే అది బడివరకూ వచ్చేది. వాళ్ళు బడిలోకి వెళ్ళగానే తను ఒక్కతే ఇంటికి వెళ్ళిపోయేది.

అంతలోనే అమ్మ గుర్తుచేసింది: "కోతి చాలా పెద్దది అయింది. ఇప్పుడింక మీరిచ్చిన మాట ప్రకారం దీన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి" అంది. పిల్లలిద్దరికీ ఇప్పుడు బడిలో పాఠాల ఒత్తిడి ఎక్కువగానే ఉంది.. కోతితో ఆడేందుకు సమయమే దొరకటం లేదు.. కోతిని అడవిలో వదలటం వాళ్లకు ఇష్టం లేదు.. "అయినా ఇచ్చిన మాట ప్రకారం నడచుకోవాల్సిందే కదా?" అని ఇద్దరూ బాధ పడుతూనే దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చారు.

అడవిలో తిరుగుతూ కొన్నాళ్ళు కోతి ఒంటరిగానే ఉంది. ఒక్కోసారి దానికి చందు-బిందుల దగ్గరికి వెళ్ళిపోదామనిపించింది కూడా. అయితే కొన్నాళ్లకు దానికి ఒక ఏనుగుతో స్నేహం కుదిరింది. "ఇన్ని రోజులూ నువ్వు మనుషుల దగ్గరే ఉన్నావు. నిజానికి ఆ మనుషుల వల్లనే మన అడవి జంతువులకు ప్రమాదం! కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి!" అని దానికి చెబుతుండేది ఏనుగు. మెల్లగా కోతి అడవి జీవితానికి అలవాటు పడింది.

ఒకరోజు ఏనుగు భయపడినట్లే అయ్యింది. కొందరు మనుషులు చిన్న అడవి జంతువుల్ని పట్టుకునేందుకు ఉరులు తగిలించి పెట్టారు అడవిలో. ఎప్పటిలాగానే గంతులు వేస్తూ పోతున్న కోతి అనుకోకుండా ఒక ఉరిలో ఇరుక్కుపోయింది. పాపం, దానికి ప్రాణాలు పోయినంత పనైంది. అయితే సమయానికి దగ్గర్లోనే ఉన్న ఏనుగు గబుక్కున తన తొండాన్ని ఆ ఉరిలోకి దూర్చింది. కోతి ప్రాణాలు దక్కాయి. ఆ తర్వాత ఏనుగు ఆ ఉరిని బలంగా నేలకు కొట్టి తొండాన్ని బయటికి లాక్కున్నది. "చూశావా, ఈ మనుషులు? వీళ్ళే, అడవి జంతువులకు ప్రధాన శత్రువులు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పానుగా, నేను?" అని మందలించింది ఏనుగు. ఆనాటినుండి కోతికి అడవి జంతువుల కష్టాలు ఒక్కటొక్కటే అర్థం అవ్వసాగాయి.

అయితే ఈసారి ప్రమాదం ఏనుగుకి ఎదురైంది. వేటగాళ్ళు ఏనుగుల్ని పట్టుకోవటం కోసం త్రవ్విన గోతిలో పడిందది! అది చూసి కోతి చాలా కంగారు పడిపోయింది. దానికి ఏనుగుని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. తనేమో చిన్నదాయె! ఏనుగును ఎలా, పైకి లాగటం? ఆ సమయంలో దానికి చందు-బిందులు గుర్తుకు వచ్చారు. "ఎలాగైనా చందు-బిందులకు ఈ సంగతి తెలియజేస్తే చాలు- వాళ్ళు ఏనుగును కాపాడగలరు" అనుకుంటూ అది చందు-బిందుల ఇంటికి పరుగు పెట్టింది. నిద్రపోతున్న చందుని లేపింది, కిటికీలోంచి. మేలుకొన్న చందూ కోతిని చూసాడు- బిందుని నిద్ర లేపాడు. చూస్తే కోతి కిచకిచలాడుతున్నది; చేతులు ఊపుతున్నది; లోపలికి రమ్మంటే రావటం లేదు. ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించారు పిల్లలిద్దరూ. ఏమైందోనని ఇద్దరూ దానివెంట అడవికి వెళ్ళి చూశారు. అక్కడ గుంటలో పడి అరుస్తున్న ఏనుగుని చూశాక వాళ్లకు సంగతి అర్థమైంది . 'మరి ఇప్పుడు ఏం చేయాలి?' -వెంటనే వాళ్ళిద్దరూ ఇంటికి పరుగెత్తి, అమ్మా-నాన్నలకు విషయం చెప్పారు.

చందువాళ్ల నాన్న పోలీసులకీ, అటవీశాఖాధికారికీ ఫోన్ చేసి, అడవిలో ప్రమాదంలోఉన్న ఏనుగు సంగతి తెలియజేశాడు. చందు-బిందులు దారి చూపారు కదా, కొద్ది గంటల్లోనే పోలీసులు, అటవీ శాఖ వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ముందుగా వాళ్లంతా కాపువేసి వేటగాళ్ళను పట్టుకున్నారు. అడవి జంతువులను పట్టుకోవటం, వేటాడటం నేరం కదా, అట్లా వాళ్లందరికీ తగిన శిక్షలు పడ్డాయి.

అటవీశాఖ వాళ్ళు గుంతలోంచి ఏనుగును బయటికి తీసి, అడవిలోకి వదిలేసారు. కోతి సంతోషానికి మేరలేదు. అది ఒకసారి ఏనుగు చుట్టూ, ఒకసారి ఇందు-బిందుల చుట్టూ తిరిగి మురిసిపోయింది!

అదంతా చూసిన చందు-బిందుల అమ్మకి కోతి తెలివి తేటల మీద నమ్మకం కుదిరింది. 'దీన్ని తమతో పాటు ఉంచుకుంటే నష్టం ఏమీ లేదు' అని కూడా అర్థమైంది. "సరే, కోతిని మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్దామా?" అంది.

కానీ కోతి ఇప్పుడు ఎక్కువ సేపు అడవిలోనే ఏనుగుతో గడుపుతున్నది. అప్పుడప్పుడూ, సెలవురోజుల్లో మాత్రం చందు-బిందులను చూడడానికి వస్తోంది.

Related Posts Plugin for WordPress, Blogger...

chitika