WORLD FLAG COUNTER

Flag Counter

Monday 11 January 2016

SANKRANTHI FESTIVAL IMPORTANCE AND ITS TRADITIONS


సంక్రాంతి వ్యాస పరంపర: మొదటి భాగం: ఊరంతా సంక్రాంతి!
ముందుమాట: 
తెలుగు నాటి అత్యంత విశిష్టమైన పండగలలో మొదటి స్థానం సంక్రాంతిదే! సంక్రాంతి ఒక పండగ మాత్రమే కాదు, సంబరాల వెల్లువ! పాడిపంటలతో లోగిళ్ళు కళకళ లాడుతూ మనసులు ఆనంద భరితం చేసే ఈ గొప్ప పండుగ గురించి శ్రీమతి నయన కస్తూరి తనదైన శైలి లో చక్కగా వివరిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తో ఈ వ్యాస పరంపర మీ ముందుకు తెస్తున్నాము. చదివి ఆనందించి, మీ పరిధిలో ఆచరించ గలరని ఆశిస్తూ...

రమణ బంధకవి
సంపాదకుడు
సంబరాల సంక్రాంతి
శ్రీమతి నయన కస్తూరి
మన పండుగలు అన్నీ మన ఇళ్లనీ, హృదయాలనీ సుఖసంతోషాలతో నింపేవే! అయినా మన తెలుగు లోగిళ్ళలో మామిడాకులు, రంగురంగుల బంతిపూల దండలతో అలరించే గుమ్మాలతో, భోగి మంటల వెలుగులతో, గొబ్బెమ్మలతో నిండిన రంగ వల్లులతో, హరిదాసుల సుమధుర కీర్తనలతో, గంగిరేద్దువాళ్ళ సన్నాయి సందడితో, ఆడవారి పట్టు వస్త్రాల రెపరెపలతో, పుట్టింటికి వచ్చిన ఆడపడచుల ఆరాటాలతో, కొత్త అల్లుళ్ళు చేసే ఆర్భాటాలతో, కనువిందు కలిగించే అందమైన బొమ్మలకోలువులతో, అంబర వీధుల ఇంద్రధనుస్సు రంగులు నింపే గాలిపటాలతో, ఇల్లంతా ఘుమఘుమ లాడించే రకరకాల తెలుగువారి పిండివంటలతో, అనురాగంతో ఇచ్చిపుచ్చుకునే కానుకలతో.....ఇలా ఒకటనేమిటి ఎన్నెన్నో వేడుకలతో ఇల్లంతా .... ఊరంతా సందడి కలిగించే పండుగ మాత్రం మన 'సంక్రాంతి' అని చెప్పక తప్పదు.
'సంక్రాంతి' ఒక రోజు పండుగ మాత్రం కాదు, సూర్యుడు ధనుర్రాశి లో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలో ప్రవేశించే రోజు వరకు నెల రోజుల పాటు ఈ పండుగ కోలాటం జరుగుతూనే ఉంటుంది. మకర సంక్రమణం జరిగిన రోజు కనుక ఈ పండుగ 'మకర సంక్రాంతి' గా కూడా పిలువబడుతుంది. ధనుర్మాసం మొదలైనప్పటి నుండి నెల పొడుపు మొదలైందని పండుగ సందడి ప్రారంభిస్తారు. పల్లెల్లో అయితే ప్రతి లోగిలి లో పండుగ వాతావరణం వుంటుంది. పంట చేతికొచ్చి ఇంట్లో ధనధాన్యాలు నిండుగా వుండటం తో, పొలాల్లో కూడా పెద్ద పనులు కూడా ఏమి లేని రోజులవడం తో రైతులు ఆనందం గా ఈ సంక్రాంతి పండుగను చేసుకుని, కొత్త పంటలోని బియ్యంతో పొంగలి చేసి, ప్రకృతికి నివేదించి, తమకి వ్యవసాయం లో సాయపడే పశువులకు కూడా పూజలు సలిపి తమ కృతజ్ఞత తెలియజేసుకుంటారు. రంగురంగుల సంక్రాంతి ముగ్గులుతో ముగ్గుల మధ్య ముద్దుగుమ్మలతో అలంకరింపబడ్డ గొబ్బెమ్మలతో ప్రతీ గుమ్మం పెళ్లి కెదిగిన స్నిగ్ద సుందరిలా వయ్యారాలు ఒలకబోస్తూ ఉంటుంది. మనం పట్టణాల్లో నగరాల్లో కూడా సంక్రాంతి ముగ్గులు కనువిందు చేస్తూనే ఉంటాయి. రకరకాల ముగ్గులు సందేశాలను అందిస్తూ కూడా వేస్తారు. ముగ్గుల పోటీలు కూడా జరుగుతూ వుంటాయి. సంక్రాంతి నాడు సూర్యభగవానుని రథం ఉత్తర దిశకు మళ్ళటానికి సంకేతముగా అందరూ ఆ రోజు రధం ముగ్గు వేస్తారు.
మనకు పట్టణాల్లో నగరాల్లో కనుమరుగైన హరిదాసుల చిడతల చప్పుళ్ళు, కీర్తనలు పల్లెల్లో వినిపిస్తూనే ఉంటాయి. జరీ పంచలు ధరించి, నెత్తి మీద పూలతో అలంకరించిన గిన్నెతో, మెడలో పూల మాలలతో, నుదుటిన విష్ణు నామాలతో ఒక చేతిలో చిడతలు వేరొక చేతిలో తంబూరా తో మెడలో ఒక జోలేతో గజ్జెల పాదాలతో లయబద్దంగా అడుగులేస్తూ, మధురం గా హరినామ సంకీర్తనలతో సుప్రభాతం పాడుతూ, ప్రతి ఇంట భక్తీ తో ఇచ్చే బిక్షను స్వీకరిస్తూ హరిదాసులు ఊరంతా ఒక పవిత్రమైన వాతావరణాన్ని నింపి అందరి హృదయాల్లో హరి పట్ల భక్తీ భావనలు పెంచుతారు. మన భూమి మీద ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు అని చెపుతారు. సంవత్సరం చివరి మాసం అయిన ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్తం తో సమానం అందుకని ఈ మాసం లో ఆచరించే ఏ దైవ కార్యమైనా విశేష ఫలితాలు ఒసగుతుంది. 


No comments:

Post a Comment