WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 13 November 2014

DETAILED HISTORY AND FULL INFORMATION ABOUT SREE KANAKA DURGA AMMA VARU - INDRAKEELADHRI - VIJAYAWADA - ANDHRA PRADESH - INDIA


విజయ దాయిని కనకదుర్గ – ఇంద్రకీలాద్రి

అమ్మలకు అమ్మ మన దుర్గమ్మ. కోరిన కోరికల తీర్చెడి కల్పవల్లి యై, ఆర్తులను ఆదుకొనెడు అభయప్రదాత్రి యై ,కనకధారలను కురిపించు బంగారుతల్లియై, పాడిపంటలను కాపాడు నిత్యకళ్యాణి యై సువాసినీ పూజలందుకుంటున్న శ్రీ గౌరియై , దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ “ తన్ను లో నమ్మిన జనమ్ముల”నాదుకుంటూ ఇంద్రకీలాద్రి పై కొలువు తీరిన త్రిపురసుందరి కనకదుర్గ. పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన పుణ్యతీర్థమిది. సాధారణ దినాలలో వేలమంది, పర్వదినాలలో లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు చేసే పవిత్ర తీర్ధమిది హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పై విజయవాడ లోకి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరిని తన అమృతహస్తాలతో ఆశీర్వదిస్తూ, ఆహ్వానిస్తూ భక్తులకు తాను కొండంత అండగా వున్నానంటూ భరోసా ఇస్తున్నట్లుగా కన్పిస్తుంది ఎడమ వైపున ఇంద్రకీలాద్రి.దాని పై కొలువు తీరిన దుర్గమ్మ. అతిథులకు అర్ఘ్య పాద్య ఆచమనీయాలివ్వడం భారతీయత గనుక కుడివైపు న ఉన్న కృష్ణమ్మ నగరంలోకి ప్రవేశిస్తున్న ప్రతిఒక్కరిని తన చల్లని చిరుగాలులతో ప్రయాణపు అలసటను పోగొడుతూ తీయని మంచినీటి ని అందిస్తూ, ప్రకాశం బరాజ్ అందాలతో ఆహ్లాదాన్ని కల్గిస్తోంది. ఇది విజయవాటిక చేసుకున్న పుణ్యం. కనకదుర్గాదేవి కరు ణాకటాక్షవీక్షణాల సాఫల్యం..

* స్థలపురాణం

పూర్వం ఇంద్రకీలుడనే యక్షుడు పార్వతీ పరమేశ్వరులను గూర్చి వేల సంవత్సరాలు తపస్సు చేసి వారిని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రత్యక్షమైన ఆది దంపతులను ఎల్లప్పుడు తనపై అదివసించి ఉండేటట్లు వరం కోరాడు. అందుకు అంగీకరించిన శివపార్వతులు యక్షుణ్ణి శైలరూపాన్ని పొందవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇంద్రకీలుడు శైలరూపాన్ని పొందగా ,ఆనాటినుండి పార్వతీ పరమేశ్వరులు దుర్గా మల్లేశ్వరు లై ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరియున్నారు. యక్షుడి పేరు కీలుడని, స్వయంభువుగా వెలసిన అమ్మను ఇంద్రాది దేవతలు కొలవడం వలన ఇంద్రకీలాద్రి అయ్యిందని ఒక కథ.

విజయుడు ప్రతిష్టించిన విజయేశ్వరస్వామి ఇక్కడ కొలువు తీరి వుండటంతో ఈ పురాన్ని విజయవాటిక యని విజయవాడ అని , బెజవాడ అని కూడ పిలుస్తున్నారు.

వనవాసం చేస్తున్న పాండవులను పరామర్శించడానికి వచ్చిన వేదవ్యాసుడు మాటల సందర్భంగా పాశుపతాస్త్ర ఫ్రస్తావన చేసి, దాన్ని సంపాదించవలసిందిగా పాండవులను ఆదేశించాడు . ధర్మరాజు ఆశీస్సులను పొందిన అర్జునుడు ఇంద్రకీలాద్రి కేగి పశుపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరతపస్సు ప్రారంభించాడు.మల్లికా పుష్ఫాలతో నిత్యం శివార్చన చేస్తూ కఠోర తప మాచరిస్తున్న అర్జునుని పరీక్షించడానికి ఆది దంపతులు కిరాతవేషధారులై ప్రవేశించారు. వరాహ వేట లో మాట పెరిగింది . ధనుర్యుద్ధం ముగిసింది. మల్లయుద్ధానికి సిద్ధపడ్డారు కిరాతార్జునులు. తను విసురుతున్న ఒక్కొక్క ముష్టిఘాతానికి కిరాతుని శరీరం నుండి మల్లికా పుష్పాలు రాలడం గమనిస్తూనే ఆవేశంతో కిరాతుని కొట్టడానికి గాండీవం ఎత్తాడు విజయుడు. ఆదిదంపతులు ప్రత్యక్షమయ్యారు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు. ఆనాడు విజయుడైన అర్జునుని చేత ప్రతిష్టించబడిన లింగమే విజయేశ్వరస్వామి. ఆయన ఉన్న ప్రాంతమే విజయవాటిక.లేదా విజయవాడ.

అర్జునునితో మల్లయుద్ధము చేసిన ఈశ్వరుడు కావున మల్ల >ఈశ్వరుడు మల్లేశ్వరుడైనాడని, మల్లికాసుమాలచే పూజించబడటం వలన మల్లి > ఈశ్వరుడు > మల్లీశ్వరుడైనాడని ఒక ఐతిహ్యం.

మహిషాసురమర్దని గా ఇందకీలాద్రి పై నున్న కనకదుర్గ అష్టబాహువులతో వివిధ ఆయుధ ధారిణియై మనకు దర్శనమిస్తోంది. ధీనికి ఆధారంగా దేవీభాగవతంలో ఒక కథ కన్పిస్తోంది.

శుంభ నిశుంభులను రాక్షసులు శివుని మెప్పించి పురుషుని వలన మరణం లేకుండా వరం పొందుతారు. ఆ వర గర్వంతో దేవతలను యజ్ఞ హవిస్సులను సైతం హరించసాగారు. దేవతలు వెళ్లి శివునితో మొరపెట్టుకున్నారు . శివుని అర్థబాగమైన గౌరి తన శరీరమునుండి ఒక స్తీమూర్తిని అవతరింపజేసింది ఆమె పేరు కౌశిక. ఆమె సౌందర్యానికి మోహితులై తమను పెళ్లి చేసుకోవలసిందిగా కౌశిక వద్దకు రాయబారం పంపించారు శుంభ నిశుంభులు. యుద్ధంలో తనను ఓడించిన వారినే వివాహం చేసుకుంటానన్నది కౌశిక. ఆ యుద్దంలో రాక్షస సేనానాయకులైన ధూమ్రలోచనుడు, చండముండులను సంహరించి, ఉగ్రరూపిణియై ప్రచండదుర్గగా శుంభనిశుంభులను సైతం మట్టుపెట్టింది తల్లి.

ఇంద్రకీలాద్రి పై వెలసిన ఆ ఉగ్రరూపిణి ని దర్శించడానికి దేవతలు కూడ భయపడుతుంటే ఆదిశంకరులు శ్రీ చక్ర స్థాపన చేసి ఆమెలోని రౌద్రకళలనన్నింటిని వేరొకమూర్తిలోకి ఆవాహన చేసి శాంతమూర్తిగా మార్చి మల్లేశ్వరునితో శాంతి కళ్యాణం జరిపించారని ఆనాటి నుండి ఆమె కనకదుర్గయై భక్తులను కాపాడుతోందని స్థలపురాణం చెపుతోంది.

* ఆలయ ప్రత్యేకత

ఇంద్ర కీలాద్రి పై వెలసిన కనకదుర్గ స్వయంభువు. ఈమె అష్టభుజాలు కలిగి,శంఖ చక్ర గదా ఖడ్గ పాశ భిండి వార త్రిశూలాది ఆయుధాలను ధరించి అభయహస్తం తో మహిషాసురమర్థని గా మనకుదర్శనమిస్తోంది .ఈవిడ మహిషాసుమర్ధని అయితే దుర్గమ్మ ఎక్కడ అని వెతుకులాడే భక్తకోటికి మన పూర్వీకులు ఒకనమ్మకాన్ని ప్రచారం చేశారు. ఇంద్రకీలాద్రి ఫైనే గుహల్లో ఎక్కడో కనకదుర్గాదేవి మూర్తి ఉందని , ఆమెను నిత్యం యోగులు ఋషులు యక్షులు కిన్నెరులు దేవతలు సేవించుకుంటూ ఉంటారని మహిషాసురమర్థని ప్రథమ ద్వారం కాగా రెండవద్వారం వద్ద చింతామణి దుర్గాదేవి దర్శనం లభిస్తుందని చెపుతున్నారు.{ www.durgamma.com }.

ఈ విధమైన వాదనే వేదాద్రి యోగానందనరసింహస్వామి విషయంలోను విన్పిస్తోంది. స్వామివారు గుహలో ఉన్నారని నేను వెళ్లి వచ్చామని వయోవృద్దులై మరణించబోతూ నాతో చెప్పిన వాళ్లు న్నారు. మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడ ఇటువంటి వాదనలు విన్నాము. వీటిని స్థూలంగా విశ్లేషిస్తే-- మంత్ర ద్రష్టలు ఉపాసనాపరులునైన మనపూర్వీకులు అనేకవేరువేరు కారణాల వలన మూలమూర్తులను మరుగు పరచి ప్రతిష్ఠామూర్తులలో మూలరూపశక్తులను ఆవాహన చేసి మనకందించారేమో నని పిస్తోంది. ఇది విషయాంతరము.చర్చనీయార్హము.

సింహవాహనారూఢయైన మహిషాసురమర్ధనిగా కనకదుర్గమ్మ కొలువు తీరివుంది. ఆమెకు ఎడమ వైపు శ్రీచక్రం ఫ్రతిష్టించబడింది. ధుర్గామల్లేశ్వర స్వామి వార్లకు జరిగే పూజలన్నీ ఈ శ్రీచక్రానికే జరుగుతాయి. ప్రక్కనే గణపతి విగ్రహం ధర్శనమిస్తుంది. విజయవాడ శక్తి ప్రధానక్షేత్రమైనప్పటికి ఇచ్చట శాక్తేయ విధానంలో ఆరాధన జరగటం లేదు. ఇది ఇక్కడి ప్రత్యేకత మహిషాసురుడనే రాక్ష సుని సంహరించిన ఆదిశక్తి మహిషాసుర మర్ధని యైంది.ఆ కథ ఇలా ఉంది. దితి రాక్షసుల తల్లి.

తనసంతానాన్నిఇంద్రుడు మట్టుపెడుతుండటంతో ఇంద్రుని చంపగలిగిన కుమారుని కోసం సుపార్శుడనే ముని ఆశ్రమం ప్రక్కగా దితి ఘోరతపస్సు ప్రారంభించింది. ఆమెతపస్సువేడికి కోపగించిన సుపార్శుడు నీకు మహిషుడు పుడతాడని శపించాడు. ఆమెకు ప్రత్యక్షమైన బ్రహ్మ సైతం ముఖము మహిషమై మిగిలిన శరీరం నరరూపంతుండే కుమారుణ్ణి ప్రసాదించాడు. మహిషుడు తపస్సుచేసి శివుని మెప్పించి మరణం లేకుండా వరాన్ని కోరాడు. పుట్టిన వానికి మరణం తప్పదు అన్నాడు శివుడు. అయితే మగవానితో మరణం లేనట్లు వరం పొందాడు మహిషుడు. మహిషుని ఆగడాలను భరించలేని దేవతాగణం తమ నారీతేజాలనన్నింటిని ఒక్కచోట చేర్చి ప్రార్ధించారు. ఆ తేజస్సునుండి ప్రచండ శక్తి ఆవిర్భవించి మహిషాసురుని మట్టుపెట్టి మహిషాసురమర్ధని యై పూజలందుకుంటోంది . ఇది ఒక స్థలపురాణం.

* చారిత్రకత

క్రీ.శ. 7వశతాబ్దం. మాధవవర్మ మహారాజు విజయవాటికను పరి పాలించే రోజులవి. అతని కుమారుడు ఇంద్రకీలాద్రి సమీపంలో వేగంగా రథాన్ని నడిపి ఒక సామాన్య స్త్రీ కుమారుని మరణానికి కారణమయ్యాడు. పుత్ర శోకంతో న్యాయార్థిని యై వచ్చిన ఆ వనిత ధర్మఘంట మోగించింది. విషయాన్ని సభలో విచారించి నేరస్థుడైన తనకుమారునకు మరణదండన విధించాడు మాధవవర్మ. అతని లోని ధర్మదీక్ష కు సంతోషించిన విజయదుర్గ విజయవాటికలో కనకవర్షాన్నికురిపించి, కనకదుర్గ అయ్యిందని ఒక ఐతిహ్యం . అయితే ఈ మాధవవర్మ పల్లవుడా? తూర్పు చాళుక్యుడా? అనేది చరిత్రకారుల్లో సంశయం ఉంది. కాలం ఏదైనా కనకవర్షం మాత్రం యదార్థం.

మల్లేశ్వరస్వామి దేవాలయంలో ముఖమండపంలోని కుడి వైపు స్థంభం మీద క్రీ.శ.9 వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి కన్పిస్తోంది.

చాగి వంశానికి చెందిన” నరసింహవర్ధన” బిరుదాంకితుడైన రెండవ పోతరాజు విజయవాటిక లోని” మల్లేశ్వర స్వామికి హవిర్బిల్వార్చనలకు నోచెండ్ల గ్రామాన్ని, జక్కమపూడి లోని రెండుభాగాలను దానంచేసినట్లు” జక్కంపూడి శాసనం చెపుతోంది.{ఆర్క్-335—1882 } ఈయన కాలం శా.శ. 1119 -1152. గుడిమెట్ట ను రాజధానిగా చేసుకొని, విజయవాటిక ,బృహత్కాంచీపురా{ పెనుగంచిప్రోలు } లను ఉపకేంద్రాలుగా చేసుకొని రెండు శతాబ్దాలు పరిపాలన సాగించిన చాగి వంశంలో ఇతని పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు.

అలాగే మనం “ బెజవాడ “అని పిలుస్తున్న పేరు కూడ అతి ప్రాచీనమైనది గానే కన్పిస్తోంది. రెండవపోతరాజు కాలంలోనే కొనకంచి ఆంజనేయస్వామి దేవాలయ స్ధంభం మీద ఉన్న శాసనంలో “ బెజవాడ తెలికివేవురు కులానికి చెందిన కుఱ్ఱిశెట్టి కొనకంచి నరేంద్రేశ్వర దేవరకు దీపమాలలు రెండుసేయించ్చె.... అని” వ్రాయబడింది. { ఆర్క్-270-1924}

శ్రీకృష్ణ దేవరాయలు దుర్గామల్లేశ్వరులను దర్శించి కానుకలు సమర్పించినట్లు శాసనాలున్నాయి. అక్కన్న మాదన్నగుహలు చారిత్రక ఆధారాలే.ఆముక్తమాల్యద కావ్యం చెరిగి పోని సాక్ష్యం కదా! బెజ్జంవాడ > బెజవాడ అయ్యిందని ఒక వాదన .
ప్రత్యేక ఉత్సవాలు ప్రతిసంవత్సరము అమ్మవారికిజరిగే ఉత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రధానమైనవి. తొమ్మిది రోజులు తొమ్మిది శక్తిరూపాలతో తల్లి భక్తులను కటాక్షిస్తుంది. వీటినే దేవీనవరాత్రులుగా వ్యవహరిస్తారు.ఇవి సెప్టెంబరు- అక్టోబరు నెలల్లో వస్తాయి. శివరాత్రికి దుర్గా మల్లేశ్వర కల్యాణం వైభవంగా జరుగుతుంది. నవంబరు- డిశెంబరు నెలల్లో భవానీదీక్షలు అంగరంగవైభవంగా జరుగుతాయి.ఇంద్రకీలాద్రే కాదు విజయవాడే దీక్షాధారులతో నిండిపోతుంది.

* ఆలయం తెరచి ఉంచు వేళలు

ప్రభాతవేళ 4గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు వివిధ దర్శనాలు లభిస్తాయి .

* రవాణాసౌకర్యాలు

విజయవాడ అతి పెద్ద రైల్వే జంక్షన్. దేశం నలుమూలలనుండి రవామా సౌకర్యం పుష్కలంగా ఉంది. కొండమీదకు 500 మెట్లతోటి కాలిబాట, ఘాటురోడ్డు సౌకర్యం ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి దేవస్ధానం వారి బస్సు సౌకర్యం ఉంది. కొండమీదకు స్వంతవాహనాలకు టోల్ రేటు అనుమతి ఉంది.

* వసతిసౌకర్యాలు

దేవస్దానం వారి వసతి గదులు రూ 50/ నుండి 250/ రూపాయల పరిధిలో ఆయా వసతులతో లభిస్తాయి .లగ్జరీ రూములు కావాలనుకొనే వారికి పెద్ద హోటళ్లు అందుబాటు లోనే ఉంటాయి. ప్రతిరోజు 600 నుండి 1000 మంది వరకు నిత్యాన్న దానం జరుగుతూ ఉంటుంది.

సంప్రదించవలసిన నెంబర్లు 0866-2423600 , 0866-2423800
వివరాలకు www.dugamma.com లో కూడ చూడవచ్చు.

No comments:

Post a Comment