WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 20 December 2015

SRI GODHADEVI - THIRUPAVAI-6 PASURAMULU COLLECTION IN TELUGU


అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాశురాలలో ఆరవరోజు పాశురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం.
ఇందులో తనతో పాటు స్నానానికి సాటి గోపికను మేల్కొల్పుతున్నటువంటి ఒక గోపికా భావం ఈ పాశురంలో మనకు కనపడుతోంది.

పిళ్ళా యెళుంది రాయ్ – అంటే ఓ బాలా మేలుకో అని అర్థం. ఇక్కడ బాల అని పిలవడంలో గోపికయొక్క అమాయకత్వమూ, ముగ్ధ భావమూ ఈ రెండూ స్ఫురిస్తూ ఉన్నాయి. అందుకే ఓ బాలా! అంటే ఓ పిల్లా! మేలుకో అని చెప్పడం. అయితే ఈ మేల్కొలిపేటప్పుడు మేల్కొల్పటానికి కావలసిన ధ్వనులెన్నో వినబడుతున్నాయి. అయినా నువ్వు మేల్కొలేదా? అని చెప్పడం కనపడుతున్నది.

పుళ్ళుమ్ శిలుంబినకాణ్ – అంటే పక్షులు కూడా కూస్తున్నాయి కదా! మరొకవైపు పక్షుల రాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి నారాయణుని ఆలయంలోంచి శంఖనాదం వినిబడుతోంది.

పుళ్ళరయ్యన్ – అంటే గరుత్మంతుని వాహనం కలిగినటువంటి నారాయణుని యొక్క

కోయిలిల్ – ఆలయం నుంచి

వెళ్ళై విళిశంగిన్ – తెల్లని శంఖం నుంచి వస్తున్న నాదం; ఆ నాదం ఎలా ఉన్నదంటే

పేరరవమ్ – పెద్ద ధ్వని; ఏదో చిన్న చిన్న సవ్వడి కాదు. పోనీ పక్షుల కిలకిలలు అంటే చిన్న చిన్నగా ఉన్నాయి. కానీ శంఖనాదం. ఆ శంఖనాదం కూడా విష్ణు మందిరంలోంచి వస్తోంది. అలాంటి దివ్యమైన శంఖనాదం నీకు వినబడలేదా? ఇంకా మేల్కొనవేమి? అని అంటున్నారు. నాదములలో భాగంగా పక్షులని చెప్పారు, గరుత్మంతుణ్ణి చెప్పారు. గరుత్మంతుడు వేద పురుషుడు కనుక వేదమంతా శబ్దబ్రహ్మ స్వరూపం గనుక ఇక్కడ గరుడ వాహనారూఢ అని మాట చెప్పడంలో ప్రత్యేకత. వేదవేద్యుడైన నారాయణుని ఆలయంలోనుంచి తెల్లని శంఖము అంటే శుద్ధ సత్త్వ భూమికతో కూడిన దివ్య నాదం. పైగా పేరరవం – పెద్ద ధ్వని అని అర్థం. పెద్ద ధ్వని అంటే క్షుద్రములైన ధ్వనులు కాకుండా దివ్యమైన, గొప్పదైన ధ్వని అని అర్థం. ఏది దివ్య భావాన్ని, దివ్యత్వాన్ని కలిగి ఉంటుందో అది గొప్ప నాదం. అదే ఇందులో పేరరవం అన్నారు. ఇలాంటి దివ్యనాదములు నీకు వినబడడం లేదా? అనడంలో విశేషం ఏమిటంటే ఆ దివ్యనాదములు విని జాగృతి చెందాలి. అదీ చెప్పడం ఇక్కడ. ఓ పిల్లా! మేలుకో. అయితే నన్ను లేపడానికి మీరందరూ వచ్చారు. ధ్వనులు వినలేదా? అని అడిగారే! మరి ఏ ధ్వనులు విని మీరు లేచి వచ్చారు? అని అడగవచ్చు. మేము ఏ ధ్వనులు విన్నామో చెప్తున్నాము విను అంటున్నారు. వీళ్ళు విన్న ధ్వనులు అంటే మేల్కొలుపుతున్న వాళ్ళు విన్న ధ్వనులు ఏమిటయ్యా అంటే

మునివర్గళుమ్ యోగిగళుమ్ మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్ ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దు – దీనియొక్క భావం ఏమిటంటే మునిశ్రేష్ఠులు, యోగులు, వీరందరూ కూడా తమ మనస్సులలో నారాయణుని ధ్యానిస్తూ; మెళ్ళ వెళున్దు – ఆ ధ్యాన భూమిలోంచి పరవశ భావంతో వెలికి పలికినటువంటి హరి హరీ అనే నాదములు మా హృదయంలో ప్రవేశించి మాలో తాపాన్ని పోగొట్టి మమ్ము మేల్కొలిపాయి. అలా మేల్కొన్న మేము నీవద్దకు వచ్చి మేల్కొలుపుతున్నాం. పైగా ఆ మునులు, యోగీశ్వరులు ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే

వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై ఉళ్ళత్తు క్కొండు – వెళ్ళత్తరవిల్ అంటే క్షీర సముద్రము, పాలకడలి. ఆ పాలకడలిలో యోగనిద్రాశయనం చేసినటువంటి జగత్కారణుడైన నారాయణుడు. ఇక్కడ విత్తినై అన్నారు. విత్తినై అంటే జగత్తుకు మూలమైన వాడు అని అర్థం. ఇది భాగవత ప్రబోధం. సాధారణంగా సుప్రభాతాలలో భగవంతుణ్ణి మేల్కొలుపుతారు. కానీ ఈ పాశురాలలో మాత్రం భాగవతులను మేల్కొల్పడం జరుగుతుంది. పైగా తానొక్కతే స్నానానికి వెళ్ళడం కాకుండా తోటి గోపికలను కూడా తీసుకువెళ్ళడం అనేది నాటి వ్రేపల్లెలో చేసినటువంటి విషయం. ఆ భావాన్ని ఇక్కడ సమన్వయించుకొని అమ్మ ఈ వ్రతాన్ని ఆచరిస్తోంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గోపికను మేల్కొల్పడం అంటే భగవదనుభూతి పొందినటువంటి ఒక్కొక్క ఆచార్యుని మేల్కొల్పడం. ఆ ఆచార్యుని మేల్కొలిపి నువ్వు నీ దివ్యానుభూతిలో ఉండడమే కాకుండా ఆ అనుభూతి నుంచి వెలికి వచ్చి మాకూ ఆ భగవదనుభూతిని పంచు. నీ మార్గదర్శకంలో మేము నడుస్తాం. నీతోపాటు మేము నడిచి ఆ భగవద్వ్రతాన్ని పాటిస్తాం అనడం. అందుకే ఇక్కడినుంచి చెప్పబడుతున్న ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆచార్యుడు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు అని చెప్పబడుతూ ఒక్కొక్క ఆచార్యుని మేల్కొలిపి ఆచార్యుని ద్వారా ఉపదేశం పొంది ఆ ఆచార్యునితో వెళ్ళడం కనపడుతున్నది. అటువంటి ఆ నారాయణుని దివ్య తత్త్వాన్ని అందుకొనడానికై గోపికలను నిద్ర లేపి ఆండాళ్ళమ్మ దివ్య గానం చేస్తూన్నది. అయితే ఇక్కడ నారాయణుని మునులు ధ్యానిస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ వైకుంఠ వాసియైన నారాయణుడు బాలకృష్ణుడైన నారాయణుడిగా ఇక్కడ వర్ణించబడుతున్నాడు.

పేయ్ ములై నంజుణ్డు కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి – అంటే పూతన ఇచ్చినటువంటి విష స్తన్యాన్ని పానం చేసి శకటాసురుని కీళ్ళు ఊడేలా తన కాలితో కొట్టినటువంటి నారాయణుని మునులు ధ్యానిస్తున్నారు. అన్నప్పుడు శేషశయనుడైన నారాయణుడే ఇక్కడ పూతనా సంహారము, శకటాసుర సంహారము, చేసినటువంటి కృష్ణ మూర్తి. అటువంటి కృష్ణుని గానం చేసినటువంటి మునులయొక్క పలుకులు విని మేము మేల్కొన్నాం. అనగా భగవదనుభూతి పొందినటువంటి ఆచార్యుల మాటలతో మేము మేల్కొన్నాం, మళ్ళీ నీయొక్క ప్రబోధం కావాలి అని మరియొక ఆచార్యుని ప్రార్థించినట్లుగా ఇందులో ధ్వని గర్భితమైన భావమున్నది. అటువంటి దివ్య గానానికి నమస్కరిస్తూ

ఆండాళ్ తిరువడగలై శరణం!!

No comments:

Post a Comment