WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 20 December 2015

IMPORTANCE OF EKADASI IN DHANURMASAM - CALLED AS MUKKOTIEKADASI


ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. 
విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే "ముక్కోటి ప్రదక్షిణ" అని పిలుస్తూ ఉంటారు.
ఈ వైకుంఠ ఏకాదశినే "పుత్రద" ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం "సుకేతుడు" అను మహారాజు 'భద్రావతి' అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు 'చంపక' ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, 'పుత్రసౌభాగ్యం' కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది.
ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము 'విశ్వదేవులము' మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని ఆ దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా 'పుత్రద ఏకాదశి' నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, ఆ పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు.
వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా 'చంపక' దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' పూర్తిచేస్తారు.
అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్‌శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ 'పుత్రద ఏకాదశి' లోని మహత్యం.

No comments:

Post a Comment