WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 7 January 2015

SRI GURU DATTA TEACHINGS IN TELUGU


1. గురువుల మాటల సంపత్తిని పోగోట్టుకోకూడదు.
2. తన యొక్క పశుత్వాన్ని నిర్మూలనం చేసి , మానవత్వాన్ని దివ్యత్వం వేపు మరలించడమే ఆధ్యాత్మికం .
3. దోషరహితమైన జీవితమే ప్రశస్తమైనది.
4. కనిపించిన అందరినీ విశ్వసించడం , ఎవరినీ విశ్వసించక పోవడం రెండూ కూడా బలహీనతలే .
5. గురువు దగ్గర ఖండించ కూడదు . సృష్టి సంహారం చేసినవాడు చేసినది హింస అనిపించుకోదు .
6. పరిశుద్ధమైన సేవలో పాప పుణ్యాలంటవు
7. పాపం చేసి క్షమించమని అడగటం నేరం , ప్రాయశ్చిత్తమే శరణ్యం కావాలి .
8. అభద్రతాభావానికి లొంగిపోకూడదు, ఆత్మాభిమానం నశించిపోతుంది .
9. కొత్త ఆలోచనలు కాదు కావలసింది , గొప్పభావనల ఉత్పన్నం జరగాలి .
10. గురువును శరణుకోరటం తీర్థయాత్రతో సమానం .
11. గురువు ఆశీస్సులు లేకుండా చేపట్టే ఏ కార్యక్రమమైనా దాని పరిపూర్ణతను సాధించలేదు.
12. వివిధ సద్విషయ శ్రవణం హృదయపు లోతులను పెంచుతుంది .
13. బయటి రూపాన్ని చూసి మనిషిని అవమానించటం అజ్ఞానం , అతడిలో నిష్కల్మష హృదయం ఉండవచ్చు .
14. మూర్ఖులు అజ్ఞానులు చేసే పనుల్లో ఎవరికైతేతోడ్పడాలనుకుంటారో వారికే తీరని హాని చేస్తుంటారు .
15. కోరికలో వుండే దోషమేమిటంటే , అది నేరవేరనందువల్ల ఎంత ఆరాటం కలుగుతుందో అది నెరవేరే తీరుకూడా అంత దుఖమూ తెచ్చిపెడుతుంది.
16. జ్ఞాని మన యెడల మైత్రి నెరపినా , ఆఖరికి వైరం పూనినా మన శ్రేయస్సునే కాంక్షిస్తాడు. లోని అహాన్ని వెళ్ళగక్కించడమే అతడి పరమోద్దేశం 
17. సాటి మానవుడి మీద , అమాయక ప్రాణుల యెడల ప్రదర్శించే దయాదాక్షిణ్యాలు చూచే దేవతలు ఆనందిస్తారు , అభినందిస్తారు .
18. ఒకే గుంటను తవ్వుతూ వుంటే నీళ్ళు పడినట్టే , ఒకే గురువును ఆశ్రయించితే జ్ఞానజలం చిలకరించబడుతుంది.
19. పట్టీతో వెళితే పాక్షికమైన భక్తి . , పట్టీ లేకుండా తత్వాన్ని ఆరాధిస్తే పరిపూర్ణ మైన భక్తి .
20. మానసిక పరిపక్వత పవిత్రమైన కర్మల ద్వారానే జరుగుతుంది .
21. వ్యక్తిని కాదు వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం వుంది ఆనందం వుంది .
22. ఇతరులకంటే మెరుగ్గా వుండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు .
23. కర్మ వల్ల విశ్రాంతిని పొందిన చిత్తం భగవంతుని తలిస్తే పరిశుద్దమవుతుంది .
24. ఆశ పిశాచి వంటిది , పట్టి పీడిస్తూనే వుంటుంది .
25. ప్రాయశ్చిత్తమంటే దుఃఖపడటమొక్కటే కాదు , ఆ గుణదోషాన్ని మంత్రోచ్చారణతో సంస్కరించుకోవాలి .
26. పూర్వజన్మ సంస్కారవాసనలతో సద్గురువెప్పుడూ గుబాళిస్తూనే ఉంటాడు .
27. జడజీవులను ఉద్దరించడానికే పరమాత్మ అవతారం తీసుకుంటాడు .
28. సహనం కలవాడు తన సంకల్పానుసారం ఏదైనా సాధించగలడు.
29. సమయాన్ని , శరీరాన్ని , పరిసరాలని సరిగా ఉపయోగించాలి .
30. సద్గురువు దగ్గర శ్రద్దాభక్తులతో ఉంటేనే రిపేరు చేయబడతారు . అలా శిక్షణ నివ్వడమే కరుణ .
31. సద్గురువు చెప్పే మాటలు వినేందుకు మనోధైర్యం కావాలి .అది ప్రేమను పెంచుకుంటేనే సాధ్యం .
32. నీ మైండ్ కి నీవే గుడ్ మాస్టర్ వి కావాలి . అదే ఆత్మగురువు .
33. అంతరేన్ద్రియాల్ని maintain చేస్తే బాహ్యేన్ద్రియాలు కంట్రోల్ అవుతాయి.
34. సద్గురువు అనుగ్రహభాషణం జనరేటర్ లాంటిది . శ్రవణం చేస్తుంటే ఎప్పుడూ రీచార్జ్ అవుతుంది .
35. చెడుభావాలపట్ల వైరాగ్యం పెరగాలి , అసహ్యం కాదు . 
36. ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తి కలగాలి , అదే జీవన సాఫల్యహేతువు .
37. చంచలం లేకుండా సర్వం సద్గురువే అని నమ్మిన వాడికి గురువు నాయకుడై నడిపిస్తాడు .
38. ఈ జీవితచక్రం చాలించుకునేందుకు నీకు శరీరం ఇవ్వబడింది .
39. ఉపనిషత్తులను అర్థం చేసుకోడానికి మార్గం కీర్తనలు .
40. దీర్ఘ జీవితము కంటే దివ్యజీవితం శ్రేష్టం .
41. మనసును స్వాధీనము చేసుకున్నవాడు శివుడు, మనసుకు స్వాధీనమైన వాడు జీవుడు .
42. ధార్మికంగా బ్రతికినప్పుడే తలెత్తుకుని ఠీవిగా బ్రతకడమవుతుంది.
43. పరమార్థం సిద్దించని విద్య వ్యర్తమైనట్టు , వ్యక్తిత్వపు విలువలు లోపించిన జీవితం భగవత్ప్రాప్తిని కలుగజేయదు
44. విలువలు లేని జీవితం వెలితిగా వుంటుంది .
45. తీవ్రమైన ఆపేక్ష ఉన్నవాడికి ఆనందం తెలియదు . మధ్యమంగా ఉండగల వాడికే గురుతత్వం లోని ఆనందం తెలుస్తుంది .
46. ఎంతటి అజ్ఞానంలో వున్నా మనం చేసే కర్మనే జ్ఞానాన్ని ఇస్తుంది .
47. సద్గురువును తలుచుకున్నప్పుడు ఒళ్ళుపులకరించినదంటే వాళ్ళ ఒంట్లో శుద్దమైన రక్తం ప్రవహించినట్టే.. నిరీక్షణ చేయటం లోనే పులకరింపు వస్తుంది .
48. ఇష్ట పడేప్పుడు తెలియదు కష్టాలెప్పుడూ ఇష్టాలచుట్టే ఉంటాయని .
49. నీ శక్తికి నీకుపయోగపడేదే మౌనం . మనసంతా గురు ప్రబోధంతో నింపుకుని మౌనస్థితికి వెళ్లిపోవాలి 
50. ఆచరణ లేని పాండిత్యం తేనేలేని తుట్టెవంటిది .
51. దత్తస్వామి అపచారం చేస్తే ఆగ్రహిస్తారు – అనుగ్రహిస్తే అష్టయిశ్వర్యాలే సిద్దిస్తాయి .
52. అవధులు దాటిన ఆగ్రహాన్ని అతిశయించిన కరుణతో గెలవగలం.
53. నమ్ముకున్న భక్తులను అందలమెక్కించడమే భగవంతుడి ప్రధాన కర్తవ్యం.
54. ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమిని , ఎప్పుడూ ఒదులుకోకు ఓర్పుని.
55. సతమతాలెందుకు , దత్తమతాన్నే నీ అభిమతం చేసుకో .
56. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు , ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు .
57. మనం మనకోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది , ఇతరులకోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది .
58. రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్యశ్రామికురాలు అమ్మ ఒక్కటే .
59. లోని దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి , అంతా చక్కగా సర్దుకుంటుంది .
60. విశ్వాసం విశ్వాసం – ఆత్మవిశ్వాసం .. భగవంతునిపై విశ్వాసం , ఇదే ఔన్నత్య రహాస్యం !
61. తోటమాలి ఆతృతతో వంద కడవలు నీళ్ళుపోసినా కూడా ఋతువు వచ్చినప్పుడే పండ్లు పండుతాయి. మెల్ల మెల్లగానే అన్ని పనులూ అవుతాయి .
62. పురుషుడికి సంఘర్షణ , యుద్ధం ,స్వాభావికం . స్త్రీకి సమర్పణ ,శాంతి ,స్వాభావికం .
63. సృష్టిలోని వైవిధ్యమే సౌందర్యానికి మూలం . ఈ వైవిధ్యాన్ని నిర్మూలించరాదు .
64. క్రమంగా జరగనిదానిలో వికాసం వుండదు .వికాసం అనే మెట్లు లేకపోతె ప్రగతి వుండదు .
65. సెలయేరు నిర్మలంగా గనుక వుంటే అది ఎక్కడనుండి బయటికి వస్తుందనే ప్రమేయమే అవసరం లేదు . సనాతనమైనా నూతనమైన దైనా , నిర్మలమైనదైతే స్వీకరించడానికి సిద్దంగా వుండాలి .
66. శిష్యుడు గురువు వద్దకు ముడిపదార్థంగా వస్తాడు .తాను విలువైన వజ్రంగా మారాలంటే గురువు దెబ్బలు సహించక తప్పదు.
67. పరమాత్మ ఎప్పుడు ఎవ్వరికి లభించినా నిత్యనూతనంగానే లభిస్తాడు . మనకే ఆయన మొదటిసారిగా లభించిన అనుభూతి కలుగుతుంది .
68. ఈ జీవితాన్ని ఎవరైతే సొంత ఇల్లనుకుంటారో , వారు అసలు ఇంటిని పోగొట్టుకుంటారు .ఈ జీవనం ఆవలవున్న గమ్యాన్ని చేరుకోవాలి .
69. గురువు ఒక ప్రక్కన శిష్యుడికి అవసరమైన ప్రేమ ఆప్యాయతలను అందిస్తూకూడా అతడి బద్దకాన్ని , అలసత్వాన్ని , నిర్లక్ష్యాన్ని తొలగించడం కొరకు కఠినంగా కూడా ప్రయత్నిస్తాడు 
70. కరుణ అంటే ఇతరులకు పంచడానికి జీవించడం, వాసన అంటే ఇతరులనుండి స్వీకరించడానికి జీవించడం . వాసన బికారి , కరుణ సామ్రాట్టు .
71. వాసన అంటే మనము ఎదో పొందడానికి జీవించడం . అదే కరుణగా మారినపుడు ధార వెనక్కు తిరుగుతుంది . పుచ్చుకునేదగ్గర ఇవ్వడం మొదలు పెడతాము .
72. దేనినీ విభజన చేయకు .సూదిలో దారాన్ని కలిపినట్టుగా ఆత్మను పరమాత్మతో కలిపి భజించు .
73. వ్యక్తిలో మొదలైన భక్తియజ్ఞం ,భగవంతుడి దగ్గర పూర్ణాహుతిని పొందాలి .
74. యావత్ సృష్టి యెడల ఔదార్యం కలిగివుండడమే దానగుణమంటే !
75. జ్ఞాని స్థితిలో నువ్వు లేనంత కాలం ఆ స్థితిని నీకు వర్ణిస్తే కాకమ్మ కథలా వుంటుందో , అలాగే ఆధ్యాత్మికానుభూతి ఎరుగని వారికి ఆ అనుభూతి గురించి మాట్లాడటం అంతే అవుతుంది .
76. అద్భుత శక్తిని దర్శించే తరుణ మాసన్నమైనపుడు ,దాని కృపకు తానెంత అనర్హుడో మనిషికి తెలిసివస్తుంది . అపుడతడెంతో వినమ్రుడవుతాడు.
77. అడగాల్సినచోట అభిమాన పడుతున్టాము ( సద్గురు దైవం దగ్గర ). అడగకూడనిచోట అభ్యర్తిస్తున్టాము ( సాటి వారి దగ్గర )
78. తర్కమనే కత్తెరను ఉపయోగించటం మానివేసి ధ్యానమనే సూదితో నీ జీవితాన్ని పరమాత్మతో కలిపి కుట్టుకో .
79. మనకు సంప్రాప్తించినదాన్ని సత్య దృష్టితో చూడగలిగితే మనసు పరమాత్మ పట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది .
80. పరమాత్మను వలచిన చిత్తం కొలతలకందే వస్తువులపైకి ఆకర్షించబడదు .
81. పరమేశ్వరుడొకడు ఉన్నాడన్న ఆరోగ్యకరమైన భయం ఆలంబనకు ఊరట .
82. సరస్వతీ కటాక్షం మనిషిని ఎంతటి స్థాయిలోనైనా నిలబెడుతుంది .
83. వున్నాడని నమ్మి మనస్పుష్పాన్ని , నమస్పుష్పాన్ని సమర్పించు . నీ వెంట పరిగెడతాడు పరమాత్మ . 
84. నీ విధిపట్ల శ్రద్దాసక్తులు పూర్తిగా కేంద్రీకృతమైనపుడు పరిపూర్ణ ప్రశాంతి లభిస్తుంది .
85. వైరమనేది ద్వేషం తోనూ , యుద్దాలతోనూ అంతమయ్యేది కాదు . విశ్వాసం తోనూ , అవగాహనతోనూ వైరాన్ని రూపుమాపాలి .
86. భక్తిలేక జ్ఞానము కలుగదు , జ్ఞానము లేక భక్తి నిలవదు .
87. మహనీయుల కరుణ కల్లోలితమైన మనసును శాంత పరచడమే కాక , దుఃఖ నివృత్తిని కూడా చేయగలదు .
88. సత్యం నిర్వచించలేనిది . అందులోకి ప్రవేశం మాత్రమే వుంటుంది .
89. శాంతిగా ఉన్నప్పుడే పరులకు ఉపకారం చేయాలన్న భావన కలుగుతుంది . అందుకే సత్వగుణ సంపదను పొందాలి .
90. మన ధర్మ సాధనలన్నీ రాబోయే తరాలకు అందించే విధంగా ధర్మాల్ని ఆచరించాలి .
91. ప్రశ్న అనేది జిజ్ఞాసతో వుండాలి . గురువులను సేవించి తద్వారా జ్ఞానం పొందినప్పుడే ప్రశ్న పుడుతుంది .
92. అవిద్య పోవాలని ప్రార్థన చేయి , మాయ పోవాలని కాదు . మాయ పరమాత్మ ఆధీనంలో వున్నది కాబట్టి .
93. దుఃఖంలో దోషాన్ని చూడు , మూలం తెలుస్తుంది .
94. జ్ఞానాన్ని సంపాదించాలంటే , గురుతత్వం ఆత్మతత్వం ముందుగా అధ్యయనం చేయాలి .
95. ఏ తీర్థమైతే మన మనసులోని మాలిన్యాలను కడుగుతుందో , ఆ గురూపదేశమే అసలైన తీర్థం ..ఇదే అమృతం !
96. ధర్మాచరణమే మనిషికి మంచి హితాన్ని కలుగజేస్తుంది .
97. గురువును గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు , సాధన చేస్తూ వారిని అనుసరించినప్పుడే ఆ గొప్పలు చెప్పుకునే అర్హత సిద్దిస్తుంది .
98. వాడిలా వీడిలా అని అనుకోకుండా’ నీవెలా ‘ అన్నవైపే నీ ఆలోచన తిప్పాలి .
99. సద్గురువును ఆశ్రయించినప్పుడే నీలో శుద్ధ సంస్కారం కలుగుతుంది .
100. మతి చెడినప్పుడు ప్రవర్తనే నీ సహజ స్వభావం ..కలలోకూడా నీ సహజ ప్రవృత్తి బయట పడుతుంది .
101. ఎప్పుడూ లోపల వుండే శివస్వరూపాన్ని తలుస్తూ చిదానందంలో తేలిపోవాలి .. శాంతి లభిస్తున్దప్పుడు.
102. ప్రతి చిన్న విషయానికి కదలి పోక , మనోబలాన్ని పెంచుకో !
103. ఔను కాదు అనే మాటలు ఎంత చిన్నవో వాటిని అనడం అంత కష్టం .
104. సర్వం పరవశం దుఖం – సర్వం ఆత్మవశం సుఖం 
105. వర్గ రహితమైనదే స్వర్గం !
106. చదవడం ద్వారా జ్ఞానం అనే ధాన్యాన్ని పండిచ్చుకోవచ్చు . కాని ఆలోచన ద్వారా అ ధాన్యం నుంచి తరకలు వేరు చేయాలి .
107. ఆశావాది ప్రతి విపత్తులోనూ అవకాశాన్ని చూస్తె , నిరాశావాది ప్రతి అవకాశంలోనూ విపత్తును చూస్తాడు .
108. మనం ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన అజ్ఞానం అంతగా తెలుస్తుంది !
109. అభ్యాసం చేదు వేరు లాంటిది ..అయినా తీపి ఫలాలనే ఇస్తుంది !

No comments:

Post a Comment