WORLD FLAG COUNTER

Flag Counter

Friday 18 July 2014

COMPETITION BETWEEN A CROW AND THE SWAN - TELUGU MORAL CHILDRENS STORIES COLLECTION



కాకి - హంస

పూర్వం ఒకానోక రాజ్యాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక వర్తకుండేవాడు. భాగ్యవంతుడు.మంచివాడు. ఒక రోజు అతనొక కాకిని చేరదీసి రోజు దానికి ఎంగిలి మెతుకులు వేసి పెంచారు.అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూ ఉండేది.

ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు. ఆ హంసల కంటే ఎత్తుగా ఎగరగలవా? "అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ కాకి తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి."మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరితూగగలిగే కాకులు ఉన్నట్టు ఎప్పుడైనా విన్నావా . చూసావా??" అన్నాయి. "నూటొక్క గతులలో పరుగెత్తడం నాకు చేతనవును. ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనలు వెళతాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం " అంది కాకి. "ఆ గతులు, గమనాలు మాకు తెలీదు.మామూలుగా సముద్రం మీద ఎగురుదాం. మేమంతా వద్దు కాని మాలో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

ఒక హంస, కాకి రెండూ సముద్రం మీదుగా ఎగరటం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి మాత్రం విన్యాసాలు చేయసాగింది.హంసను దాటిపోయి వెనక్కి తిరిగి హంసను వెక్కిరించడం,ముక్కు మీద ముక్కు పెట్టడం, జుట్టు రేపుకుని, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులు చేసింది. హంస అవన్ని పట్టించుకోక ఊరకుంది. కాసేపటికి కాకి అలిసిపోఉయింది. హంస పొడుగ్గా ఎగిసి పడమరకు పరుగెత్తింది. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమోహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. "అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి కాసేపు ఆగుదామంటే పర్వతాలు, చెట్లు కూడా లేవు. ఈ సముద్రంలో పడితే మరణమే గతి" అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది.

అది చూసి "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేసావు. ఒక్కటీ చూపవేమి వాయసరాజమా?" అంది హంస. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా ఉంది. "ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నూ మిన్నూ గానక నాకెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతులనయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిప్పుడు తెలిసింది. నాయందు దయ చూపి నను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడిన హంస తన కాళ్ళతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది."ఇంకెప్పుడు గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస.
కాకి లెంపలేసుకుంది.

No comments:

Post a Comment