WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 25 March 2014

MESSAGE FROM LORD HANUMAN - MEANING OF LORD HANUMAN - TELUGU ARTICLE ON LORD HANUMANJI



హనుమంతుడి సందేశం ?

హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

No comments:

Post a Comment