WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 22 February 2014

SALT - USES TO HUMANS - ADVANTAGES AND DISADVANTAGES OF USING SALT - BRIEF ARTICLE ON SALT


'ఉప్పులేని కూర యొప్పదోరు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు... అప్పులేనివాడే అధిక సంపన్నుడు...' అంటూ సాగే వేమన పద్యాన్ని చాలామంది చదివే ఉంటారు. దీనిలో అప్పులేని అధికమైన ధనవంతుడని చెప్పినా తొలుత 'ఉప్పులేని కూర..' అన్నాడు. కూర రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. నేడు ఉప్పువాడని పదార్ధం అంటూ లేదు. చివరకు చాలామంది మంచినీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలుపుకుని తాగుతుంటారు కొన్ని సందర్భాల్లో. అలా ఉప్పు అన్నది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఉప్పుకోసం సత్యాగ్రహమే జరిగిన దేశం మనది. గాంధీగారి 'ఉప్పు సత్యాగ్రహం' ఆనాటి పాలకులను గడగడలాడించిన సంగతి జగద్విదితమే. అయితే ఉప్పుఅయినా, అప్పు అయినా ఎక్కువైతే ముప్పే సుమా! మన శరీరానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే ఉప్పును వాడుకోవడం ఉత్తమం. 

సాధారణంగా మన శరీరానికి ఉప్పు రోజుకు సుమారుగా 4 గ్రాములు అవసరమవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొలతలతో తీసుకోరు కనుక ఉప్పును చాలామంది అనుకున్న దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉప్పును ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఉప్పు ఎక్కువగా వాడే వారికి అధిక రక్తపోటు వస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. అలాగే అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, మూత్రాశయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తపోటు వచ్చిన వారు పలు విధాల మందులను ఎక్కువగా వాడకుండా సాధ్యమైనంత తక్కువగా ఉప్పును వాడటం ద్వారా రక్తపోటు చాలామటుకు అదుపులో ఉంచుకోవచ్చునని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

రక్తపోటు తగ్గేందుకు వాడే మందులవల్ల కళ్ళు తిరగడం, ఒళ్ళు తూలడంతో పాటు గుండె జబ్బులు వంటి అనర్ధాలకు దారి తీస్తుందని డాక్టర్లు హెచ్చరించడమేకాదు, రక్తపోటును తగ్గించుకోవడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరమనికూడా చెబుతున్నారు.

చిన్నపిల్లలు ఉప్పు ఎక్కువగా తినడం, ఊరగాయలు ఎక్కువగా తినడం వల్ల వారిలో ఉదర సంబంధమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉప్పు ఎక్కువగా వేసి తయారుచేసే కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్‌ను తినిపిస్తుంటారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఫాస్ట్‌ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.

నేడు ఎంతోమంది జరిపిన పరిశోధనల్లో ఉప్పుకోసం ప్రత్యేకంగా ఉప్పును వాడనవసరం లేదని మనం రోజూవారీ తీసుకునే ఎక్కువగా వండని కూరగాయలు, పండ్లలో మన శరీరానికి అవసరమైన ఉప్పు లభిస్తుందని పరిశోధనల్లో ద్వారా తేలింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఉప్పును అసలు తీసుకోకుండా ఉన్నట్లయితే నీరసం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఏర్పడతాయంటున్నారు. అందుకే ఉప్పును ఎంతవరకో అంతే తీసుకోవడం ఉత్తమం.

ఉప్పువల్ల కొన్ని లాభాలుకూడా ఉన్నాయి. ఉప్పును నీళ్ళల్లో కలిపి ఇంటిని శుభ్రంగా కడిగినట్లయితే ఈగలు కొన్ని గంటల వరకు నేలపై వాలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దీపం బుడ్డిలో పోసే కిరోసిన్‌లో కొద్దిగా ఉప్పు కలిపితే దీపం కాంతి ఎక్కువ కావడమేకాకుండా, కిరోసిన్‌ కూడా ఆదా అవుతుంది. ఈ విషయం తాతయ్య, నానమ్మలు ఉన్న ఇళ్ళల్లో చాలామంది తెలిసే ఉంటుంది. నేటికి కూడా కిరోసిన్‌ దీపాలు వాడే చాలా ఇళ్ళల్లో ఇలా చేస్తుంటారు కూడా. వస్త్రాలమీద సిరా మరకలు ఉన్నట్లయితే ఉప్పుతో బాగా రుద్ది, వేడినీళ్ళతో కడిగినట్లయితే పోతాయి. 

నిల్వ ఉండే బియ్యంలో ఉప్పును చల్లినట్లయితే పురుగులు బియ్యానికి పట్టే అవకాశం లేదు. దానిలో ఉన్న పురుగులు కూడా పోతాయి. ఇలా ఉప్పు వల్ల చాలా లాభాలున్నాయి. అయితే శరీర ఆరోగ్యం ముఖ్యం కనుక శరీరానికి ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పునే వాడటం ద్వారా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

No comments:

Post a Comment